- ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం
- బీజేపీ కార్పొరేటర్ల ఫ్లకార్డుల్లో అసదుద్దీన్ ఫొటోతో రగడ
- ప్లకార్డులు చింపేందుకు యత్నం.. ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట
- మేయర్, డిప్యూటీ మేయర్ రిజైన్ చేయాలంటూ పోడియం వద్ద బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల బాహాబాహీకి దిగారు. దీంతో ఇరుపార్టీల సభ్యుల మధ్య తోపులాట జరిగింది. హాల్‌లో టేబుల్స్ ఎక్కి వీరంగం సృష్టించారు. సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ల ప్లకార్డుల్లో ఎంపీ అసద్దుద్దీన్ ఫొటో ఉండటంతో గొడవ స్టార్ట్ అయింది. ప్లకార్డుల్లో ‘బీఆర్ఎస్ -ఎంఐఎం -కాంగ్రెస్ దోస్తీ.. సమస్యలపై ప్రజలు కుస్తీ’, ‘పన్నులు మా ఇంటి నుంచి.. నిధులు ఎంఐఎం వీధుల్లోకి..’అని బీజేపీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ ప్లకార్డులపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలు పెట్టడంతో ఎంఐఎం కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్లకార్డులను చింపివేసేందుకు ప్రయత్నించడంతో కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు, తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పదేపదే పోడియం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ మేయర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సమావేశం మూడుసార్లు వాయిదా పడింది. చివరకు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండానే కౌన్సిల్ నిరవధికంగా వాయిదా వేశారు.
సమావేశం సాగిందిలా..
ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ ప్రారంభమైంది. వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియం దగ్గరకు చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 11 గంటలకు సభ ప్రారంభం కాగా, మేయర్ ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మళ్లీ ఆందోళన చేశారు. వారికి కౌంటర్‌గా కాంగ్రెస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. దీంతో మేయర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఇటీవల మాజీ ఎంపీ డి.శ్రీనివాస్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత, ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహిన్ బేగం మరణం పట్ల సభ్యులు సంతాపం తెలిపారు.
అనంతరం మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద మేయర్‌ని చుట్టుముట్టడంతో టీ బ్రేక్ ఇచ్చారు. తిరిగి మధ్యాహ్నం 12.15 గంటలకు సభ ప్రారంభమైంది. ఇదే సమయంలో కమిషనర్ ఆమ్రపాలి ప్రసంగంతో పాటు అడిషనల్, జోనల్ కమిషనర్లు సభ్యులతో పరిచయం చేసుకున్నారు. తర్వాత వాటర్ బోర్డుకి సంబంధించి సమావేశానికి ఎండీ రాకుండా డైరెక్టర్లు రావడంతో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.
వాటర్ బోర్డుకి సంబంధించి అనేక సమస్యలు ఉంటే ఎండీ రావడం లేదని, ప్రతి సమావేశంలో ఇలాగే తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో 12.45 గంటలకు మరోసారి సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. తిరిగి 1.30 గంటలకు సమావేశం స్టార్ట్ కాగా, మళ్లీ అదే పరిస్థితి ఉండటంతో సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
బీఆర్‌ఎస్ వాళ్లు ప్లాన్‌తో వచ్చారు: మేయర్ విజయలక్ష్మి
కౌన్సిల్ సమావేశంలో ఆందోళన నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు కనిపించిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కౌన్సిల్ వాయిదా అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు. ఒక మేయర్‌గా హైదరాబాద్ డెవలప్ కావాలని నాకూ ఉంటుంది. కానీ సమావేశంలో సమస్యలపై చర్చ కోసం సభ్యులు సహకరించలేదు. నేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు పదేపదే పోడియం వద్దకు రావడం సరికాదు. అసలు ఆ డిమాండ్ చేసే ముందు జీహెచ్ఎంసీ యాక్ట్ చదవండి. కమిషనర్‌తో పాటు అధికారులంతా కొత్త వారు. వారిని పట్టించుకోకుండా కార్పొరేటర్లు ఇలా వ్యవహరించడం సరికాదు. కౌన్సిల్‌లో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చాను. ఎక్స్అఫీషియో సభ్యులు సభలో కూర్చుని ఇలా చేయించడం సరికాదు. సభలో బీజేపీ, -ఎంఐఎం కార్పొరేటర్ల తీరు బాధా కలిగించింది”అని మేయర్ పేర్కొన్నారు.
