అమానుష ఘటన.. బ్రతికున్న తాబేలును మంటలపై వేయించారు

అమానుష ఘటన.. బ్రతికున్న తాబేలును మంటలపై వేయించారు

ఉత్తరప్రదేశ్‌: సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. బ్రతికున్న తాబేలును సజీవ దహనం చేస్తూ ఇద్దరు వ్యక్తులు పైశాచిక ఆనందం పొందారు. పైగా ఆ సంఘటనను మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. దాంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వీడియోలో, ఒక వ్యక్తి ఇటుక పొయ్యిపై తాబేలును ఉంచి నేలకు అదిమిపట్టే ప్రయత్నం చేశాడు. మరొక వ్యక్తి పుల్లల సాయంతో మంటను వెలిగించి దానిని సజీవ దహనం చేశాడు. మంట దగ్గర ఉంచడంతో తాబేలు నిస్సహాయ స్థితిలో కనిపిస్తోంది. వేడికి కొద్దిసేపటి తర్వాత తాబేలు సజీవ దహనమైంది.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్యప్రాణుల (రక్షణ) చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. అయితే, ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు వారిని తేలికగా విడిచిపెట్టారనే విమర్శలు వస్తున్నాయి.

వన్యప్రాణుల (రక్షణ) చట్టం 1972 ప్రకారం, తాబేళ్లు, గట్టి షెల్ తాబేళ్లను అక్రమంగా రవాణా చేయడం, వేటాడటం లేదా చంపడం శిక్షార్హమైన నేరం.