
రాజస్థాన్‌లోని కోట అనంతపురలోని దీప్ శ్రీ భవనంలో నిన్న రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 ఏళ్ల టీవీ నటుడు వీర్ శర్మ, అతని సోదరుడు 15 ఏళ్ల శౌర్య శర్మ మరణించారు. 'వీర్ హనుమాన్' సీరియల్లో వీర్ శర్మ లక్ష్మణుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ సినిమాలో చిన్ననాటి రోల్ పోషిస్తున్నాడు.
తెల్లవారుజామున బిల్డింగ్ నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో ఇద్దరు బాలురు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. సమాచారం ప్రకారం, దట్టమైన పొగ కారణంగా ఇద్దరు పిల్లలు ఊపిరాడక మరణించారు. అయితే అపార్ట్‌మెంట్ నుండి పొగలు వస్తున్నట్లు చూసిన ఇంటి పక్క వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకుని, తలుపులు పగలగొట్టి పిల్లలను బయటికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ డాక్టర్లు వారు అక్కడికి చేరుకునే లోపే చనిపోయినట్లు చెప్పారు.
ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని తెలుస్తోంది. డ్రాయింగ్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది, ఫ్లాట్‌లో కాలిన గుర్తులు కనిపించాయి. విద్యుత్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
►ALSO READ | హర్యానా స్కూల్లో దారుణం: బాలుడిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు; ప్రిన్సిపాల్, సిబ్బందిపై కేసు..
వీర్, శౌర్యల తల్లి రీటా శర్మ ఒక నటి, తండ్రి జితేంద్ర శర్మ కోటలోని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది, ఇద్దరు పిల్లల ఆకస్మిక మరణం అక్కడి స్థానికలను ఒక్కసారిగా కదిలించింది.