
టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి గుర్తుండే ఉంటుంది. ఇప్పట్లో సుమ మాదిరిగా తెలుగులో అప్పట్లో చాలా సినిమాల ఆడియో ఫంక్షన్స్కు, 50 డేస్ ఫంక్షన్స్కు, 100 డేస్ ఫంక్షన్స్కు శిల్పా యాంకరింగ్ చేస్తుండేది. బుల్లితెరపై కొన్ని షోలు కూడా చేసింది. తెలుగులో బిగ్ బాస్-3 సీజన్లో కంటెస్టెంట్గా కూడా షోలో కొనసాగింది. సడన్గా ఇప్పుడు ఈమె వార్తల్లో ఎందుకు నిలిచిందంటే.. తన 32 ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ విషయంలో.. ఒక ఎస్ఐ జోక్యం చేసుకుని తమను వేధిస్తున్నాడని శిల్పా హైకోర్టును ఆశ్రయించింది. శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్ యాకయ్య ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ టి వినోద్ కుమార్ ఎస్ఐ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ల్యాండ్ సర్వేలు చేయడం, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం పోలీసుల పని కాదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శిల్పా చక్రవర్తి 32 ఎకరాల ల్యాండ్ విషయంలో ఎస్ఐ సెటిల్మెంట్ తీరుపై.. సదరు పోలీస్, నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తితో పాటు హోం డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, డీజీపీకి, నల్గొండ ఎస్పీకి, దేవరకొండ డీఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సమాధానమివ్వాలని కోర్టు ఆ నోటీసులలో స్పష్టం చేసింది.
శిల్పా చక్రవర్తి తన పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2017లో మహ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తికి చెందిన 32 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ను శిల్పా చక్రవర్తి దంపతులు కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కుర్ముడ్ గ్రామంలో ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ విషయంలో పొలం అమ్మిన అజీజ్తో పాటు చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి తమను వేధిస్తున్నారని శిల్పా చక్రవర్తి పిటిషన్లో పేర్కొంది.
సివిల్ కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వచ్చి ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇవేం పట్టించుకోకుండా ఎస్ఐ రామ్మూర్తి ఈ ల్యాండ్ విషయంలో జోక్యం చేసుకుని వేధిస్తున్నాడని యాంకర్ శిల్పా కోర్టుకు తెలిపింది. ఈ ల్యాండ్ వివాదాన్ని పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసుకోవాలని సదరు ఎస్ఐ ఒత్తిడి చేశాడని వెల్లడించింది. శిల్పా పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఎస్ఐ రామ్మూర్తికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.