పిల్లలకు ఆట, పాటలతో టీవీ పాఠాలు

పిల్లలకు ఆట, పాటలతో టీవీ పాఠాలు
  • ఫస్ట్, సెకండ్ ​క్లాస్​ పిల్లలకు ఆట, పాటలతో టీవీ పాఠాలు
  • నెల రోజుల రెడీనెస్ ప్రోగ్రాం 
  • పిల్లలను టీవీల ముందు కూర్చోబెట్టడమే లక్ష్యంగా క్లాసులు 
  • ఆగస్టులోనే స్టార్ట్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల కసరత్తు 

హైదరాబాద్, వెలుగు: ఫస్ట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్లకు ఆగస్టు నుంచి ఆన్​లైన్ పాఠాలు చెప్పేందుకు స్కూల్​ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరంతా ఇప్పటి వరకు బడి మొఖమే చూడలేదు కాబట్టి, ముందుగా వారిని బడికి సిద్ధం చేసేలా ఆగస్టు నెలంతా స్టూడెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ పెట్టాలని నిర్ణయించారు. పిల్లలను టీవీల ముందు కూర్చొబెట్టి, ఆట, పాటల ద్వారా వారిని రెగ్యులర్ క్లాసులకు సమాయత్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్​తో గతేడాది మార్చిలోనే విద్యాసంస్థలు మూతపడ్డాయి. అదే ఏడాది సెప్టెంబర్​లో కొత్త అకడమిక్ ఇయర్​కు సంబంధించి ఆన్​లైన్ క్లాసులు ప్రారంభించినా, ఫస్ట్, సెకండ్ క్లాసులకు మాత్రం పెట్టలేదు. అలా ఆ ఏడాది బడి మొఖం చూడకుండానే, సర్కారు బడులకు చెందిన ఫస్ట్,సెకండ్ క్లాసుల స్టూడెంట్లు ప్రమోట్ అయ్యారు. కార్పొరేట్​బడులతో పాటు కొన్ని ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఆన్​లైన్ క్లాసులు నిర్వహించాయి. 2021–22 ఏడాదిలో  ఫస్ట్, సెకండ్ క్లాసుల స్టూడెంట్లకు ఆన్​లైన్ క్లాసులైనా నిర్వహించాలని పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడంతో అనివార్యంగా ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ప్రతిపాదనలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపలేదు. 

నెలంతా రెడీనెస్​ ప్రోగ్రామే..
దాదాపు రెండేండ్లుగా పాఠాలు వినని స్టూడెంట్లను, ఆ వైపు మళ్లించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి ఆన్​లైన్ క్లాసులు ఎప్పుడు ప్రారంభమైనా, ముందుగా రెగ్యులర్​ పాఠాలు కాకుండా టీవీల ముందు ఎలా కూర్చోబెట్టాలా అనే దానిపై ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఎస్​సీఈఆర్టీ ద్వారా యానిమేషన్ స్టోరీలు, సాంగ్స్​తదితర ప్రోగ్రాంలను రూపొందిస్తున్నారు. ‘ప్రజ్ఞత’ నేషనల్ ​రోల్స్ ​నిబంధనల ప్రకారం రెండో తరగతి వరకు వారానికి ఐదురోజులే ఆన్​లైన్ పాఠాలు చెప్పాలి. రోజుకు రెండు సెషన్లలో గంటన్నర మాత్రమే క్లాసులు నిర్వహించాలి. వీటికి అనుగుణంగానే రోజుకు రెండు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. రెడీనెస్​ ప్రోగ్రాం నెలరోజుల పాటు చేపట్టాలని అనుకున్నా, పిల్లల్లో మార్పు రాకుంటే మరో 15 రోజులు దాన్ని పొడిగించాలని భావిస్తున్నారు. ఈ క్లాసుల్లో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్​సబ్జెక్టులు ముఖ్యమైనవి. వీటన్నింటనీ ఆటపాటలతో నేర్పించాలని భావిస్తున్నారు. అందుకు ఎస్​సీఈఆర్టీ వర్క్​షీట్లను రెడీ చేస్తోంది. 

లెస్సన్లు రెడీ చేశాం..
ఫస్ట్, సెకండ్ క్లాసుల స్టూడెంట్లకు సంబంధించిన ఆన్​లైన్ లెస్సన్లు రెడీ చేశాం. కొంతకాలంగా వీరంతా బడులకు దూరంగా ఉన్నారు కాబట్టి, వారిని ముందుగా టీవీల ముందు కూర్చోబెట్టేలా పాఠాలు రూపొందిస్తున్నాం. రెగ్యులర్ పాఠాలు కూడా అదే విధంగా తయారు చేస్తున్నాం. ఆగస్టులో క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 
‑ శ్రీదేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్