తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ కథలు నచ్చక రిజెక్ట్ చేశా:వాణి భోజన్

తెలుగులో  ఆఫర్లు వచ్చాయి  కానీ కథలు నచ్చక రిజెక్ట్ చేశా:వాణి భోజన్

సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదు. వాటిలో అవకాశాలు రావడమే గొప్పయితే.. వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయంలో సక్సెస్​ఫుల్​ కెరీర్​ అందుకుంది వాణీ భోజన్. ఎంత పెద్ద ప్రొడక్షన్​ అయినా, మంచి కథ ఉన్నా.. తనకు ఇబ్బందిగా అనిపించే రోల్, నటన వంటివి ఉంటే మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అలాంటి ఈ అందాల నటి టీవీ నుంచి బిగ్​ స్క్రీన్​కి వచ్చింది. రకరకాల జానర్స్​లో లీడ్​ రోల్స్ చేస్తూ ఆడియెన్స్​ని మెస్మరైజ్ చేస్తోందామె.  

ఒకప్పటి టీవీ సీరియల్​ నటి వాణీ భోజన్.. కానీ, ఆ ఇమేజ్​ని ఒక్క సినిమాతోనే పోగొట్టేసింది. టీవీ సీరియల్స్​లో​ మంచి అవకాశాలు వచ్చాయి. పెద్ద పేరు, అవార్డ్​లు తెచ్చిపెట్టాయి. అయినా, ఆమె అక్కడితో ఆగిపోవాలి అనుకోలేదు. సినిమాల్లో తన లక్​ పరీక్షించుకోవాలనుకుంది. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఎంచుకుంది. కంటెంట్​ ఉన్న సినిమాలు, స్టార్​ హీరోలతో కలిసి నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పర్సనల్​, ప్రొఫెషనల్​ జర్నీ గురించి ఆమె మాటల్లోనే..

‘‘మా సొంతూరు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న ఊటీ. చదువంతా ఊటీలోనే. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఇంగ్లిష్ లిటరేచర్​ డిగ్రీ పూర్తిచేశా. చదువుతోపాటే కింగ్​ఫిషర్ ఎయిర్​ లైన్స్​లో గ్రౌండ్​ స్టాఫ్​లో పనిచేసేదాన్ని.  ఫ్రెండ్​ సలహాతో మోడలింగ్​లో ట్రై చేశా. మొదటిసారి 2010లో తమిళంలో ‘ఒర్ర్ ఎరవూ’ అనే సినిమాలో చాలా చిన్న పాత్రలో కనిపించా. ఆ తర్వాత 2012లో ‘అడిగారం 79’లో సపోర్టింగ్​లో నటించా. అవి చేస్తుండగా ‘మాయ’ అనే సీరియల్​లో నటించేందుకు అవకాశం వచ్చింది. దాంతో అక్కడి నుంచి యూటర్న్​ తీసుకుని, టీవీ సీరియల్స్​లో లీడ్ రోల్స్ చేయడం మొదలుపెట్టా. ‘మాయ’ తర్వాత ‘ఆహా’ అనే సీరియల్​లో లీడ్​ రోల్​ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ‘దైవమగల్’లో నటించా. అందులో నా రోల్​ పేరు సత్యప్రియ. ఆ సీరియల్ బాగా హిట్​ అవడంతో నన్ను అందరూ దైవమగల్ సత్య ప్రియగా గుర్తించేవాళ్లు. తమిళనాడులో ఎక్కువగా చూసే సీరియల్స్​లో అది ఒకటి. అంత పాపులారిటీ ఉన్న సీరియల్ అది. యూట్యూబ్​లో చూస్తే దాదాపు అన్ని ఎపిసోడ్లు ఒక మిలియన్ వ్యూస్​ పైనే ఉంటాయి. అంతేకాదు.. 2017లో  బెస్ట్ టెలివిజన్ యాక్ట్రెస్​గా నాకు వికటన్ అవార్డ్​ కూడా వచ్చింది.

ఆ అవకాశం తెలుగులోనే..

విజయ్​ దేవరకొండ ప్రొడక్షన్​లో వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో లీడ్​ రోల్​లో చేసే అవకాశం వచ్చింది. నేను లీడ్​ రోల్​లో నటించిన మొదటి సినిమా ఇదే. 2019లో రిలీజ్​ అయిన ఈ సినిమా కమర్షియల్​ సక్సెస్​ అందుకుంది. ఈ సినిమా తర్వాత తమిళంలో ‘ఓ మై కడవులె’లో అవకాశం వచ్చింది. దాంతో తమిళ సినిమాలో కూడా మంచి అవకాశం దక్కింది. ఆ సినిమా బాగా సక్సెస్​ అయింది. అంతేకాదు.. బెస్ట్ సపోర్టింగ్​ యాక్ట్రెస్​గా జె.ఎఫ్​.డబ్ల్యూ అవార్డ్​ దక్కింది. అదే కేటగిరీలో సైమా అవార్డ్స్​కి కూడా నామినేట్ అయ్యా. అదే సంవత్సరం, ‘లాకప్​’ అనే క్రైమ్ థ్రిల్లర్​లో లీడ్​ రోల్​ చేసే ఛాన్స్ వచ్చింది. కొవిడ్​ కారణంగా దాన్ని ఓటీటీలో రిలీజ్​ చేశారు. ఆ తర్వాత ‘ట్రిపుల్స్​’ అనే వెబ్​ సిరీస్​లో నటించా. 

రాధామోహన్ పనితనానికి నేను ఫ్యాన్​ని. ఆయన నాకు ఫోన్ చేసి ‘మలేషియా టు అమ్నేషియా’ గురించి చెప్పినప్పుడు కథ వినకుండానే ఒప్పుకున్నా. ఆ తర్వాతే కథ పూర్తిగా విన్నా.‘రామే ఆందలుం రావణే ఆందలుం’, ‘మహాన్’ వంటి సినిమాలతోపాటు మరికొన్ని సినిమాల్లో నటించా.  రీసెంట్​గా ‘సెంగలం’ వెబ్​ సిరీస్​​లో యాక్ట్​ చేశా. త్వరలో మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఆడియెన్స్​ ముందుకు రాబోతున్నాయి.  

ఎమోషనల్​ అయ్యా

మొదట స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్​గా అనిపించింది. ఇది పైరసీకి మాత్రమే కాకుండా నిజ జీవితానికి కూడా కనెక్షన్​ ఉంటుంది కాబట్టి నేను ఇందులో భాగం కావాలనుకున్నా. దీంట్లో నేను ఫోరెన్సిక్​ ఆఫీసర్​గా నటించా. డైరెక్టర్​కి ఏం కావాలో తెలుసు కాబట్టి, నేను ప్రిపేర్​ అయ్యే వర్క్​ ఏం లేదు. పైరసీకి సంబంధించి నాకు తెలిసింది చాలా తక్కువ. కానీ, నేను ఈ ప్రాజెక్ట్​లోకి ఎంటర్​ అయ్యాక దాని నెట్​వర్క్ ఎంత పెద్దదో తెలిసింది. దాంతో నేను ఈ ప్రాజెక్ట్​కి బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే ఇందులో నేను చేసిన రోల్​కి బ్యాక్​ స్టోరీ ఉంది. అది కూడా చాలా ఎమోషనల్​గా ఉంటుంది. దాంతో నేను సిరీస్​ పూర్తి చేశాక కూడా అది తలచుకుంటే బాధేస్తుంది. 

నా ఇంపార్టెన్స్​ ఇదే

నేను స్క్రీన్​ టైం కంటే యాక్టింగ్​కే ఇంపార్టెన్స్ ఇస్తా. నా పాత్ర ఎగ్జైటింగ్​గా ఉండి, నేను దాన్ని సరిగ్గా చేయగలను అనే నమ్మకం ఉంటే అది ఓకే చేస్తా. కొవిడ్​ టైంలో థియేటర్లు మూసివేయడంతో నా సినిమా రిలీజ్​లు కూడా లేటయ్యాయి. ఇండస్ట్రీలో గైడెన్స్​ ఇచ్చేవాళ్లు ఎవరూ లేకపోతే ప్రాజెక్ట్​లు నిలుపుకోవడం అంత ఈజీ కాదు. నా సీరియల్ కెరీర్​కు ‘ఓ మై కడవులే’తో ఫుల్​స్టాప్​ పడింది. అప్పటినుంచి చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద సక్సెస్​ వచ్చింది. మొదట్లో ప్రతి అవకాశానికి ‘ఓకే’ చెప్పాలనే అనిపించేది. ఇప్పుడు అలా కాదు.. కఠినంగా చెప్పడానికి భయపడడం లేదు. కాకపోతే దానివల్ల అవకాశాలు తక్కువై, డబ్బు కూడా తక్కువ అవుతుంది. అయినా పర్లేదు, ఎందుకంటే నాకు, నా నటనకు ఇంపార్టెన్స్ పెరిగింది. 

టీవీ సీరియల్స్​లో చేసేటప్పుడు కొన్ని ఏండ్ల పాటు ఒకటే క్యారెక్టర్​ చేయాల్సి వచ్చేది. కానీ, సినిమాల్లోకి వచ్చాక, ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం, వాటిలో డిఫరెంట్​ క్యారెక్టర్స్​లో నటించడం ఛాలెంజింగ్​గా ఉండేది. అయినా ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి రావడానికి పెద్దగా కష్టమనిపించలేదు. నా సినిమాలను చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటా. పాత్ర కోసం ముందే రెడీ అవ్వకపోయినా, న్యాయం చేయలేని పాత్రను ఎప్పుడూ చేయను. 

అందుకే ఆ సినిమా వద్దనుకున్నా

‘బ్యాచిలర్’ సినిమాలో నాకు ఒక మెయిన్ రోల్​ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ, నేను అందులో నటించడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే.. అందులో చాలా క్లోజ్​ అప్ షాట్​ గురించి నాకు అభ్యంతరాలు ఉన్నాయి. నేను ఆ క్యారెక్టర్ చేస్తే, అందులో చాలా సీన్లు మార్చాల్సి వస్తుందని భయపడ్డా. డైరెక్టర్ నాకు సరిపోయేలా పాత్ర లేదా సీన్​ మార్చాలని నేను అనుకోవట్లేదు. యాక్టర్స్ ఎవరైనా తాము పనిచేసే మూవీ మేకర్స్​ క్రియేటివిటీని గౌరవించడం ముఖ్యం. అలాగని నేను ఈజీగా రిజెక్ట్ చేయలేదు. నిజానికి అదొక గొప్ప అవకాశం నాకు. కానీ, కొన్ని అవకాశాలు కోల్పోయినా నా ప్రిన్సిపల్స్​కి కట్టుబడి ఉండడం కూడా నాకు చాలా ముఖ్యం అనిపించింది. అందుకే ఆ సినిమా వదులుకున్నా.

సోషల్ మీడియాలో..

నా ఇన్​స్టాగ్రామ్​లో 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, నిజానికి నేను సోషల్​ మీడియాలో ఎక్కువగా యాక్టివ్​గా ఉండను. ఫొటోస్ పోస్ట్ చేయడానికి నాకు రిమైండర్ అవసరం. అయినప్పటికీ, నాకు సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది. సరైన ప్రచారాలకు మాత్రమే మద్దతు ఇస్తా. అంతేకానీ, ఎంత డబ్బిచ్చినా నాకు నమ్మకం లేని బ్రాండ్​లను నేను రెకమెండ్ చేయను. 

మాది బడగ ఫ్యామిలీ. బడగ అంటే తమిళనాడులో ఉండే ఒక కమ్యూనిటీ పేరు. మా నాన్న వైల్డ్ లైఫ్​ ఫొటోగ్రాఫర్. అడపాదడపా మోడలింగ్​ షూట్స్ కూడా చేసేవాడు.నేను నటిని మాత్రమేకాదు యోగా టీచర్​ని కూడా. కెరీర్ మొదట్లో ఒక యోగా ప్రోగ్రామ్​కి హోస్టింగ్​ కూడా చేశా.యాక్టర్​ ధనుష్​కి నేను చాలా పెద్ద ఫ్యాన్. అవకాశమొస్తే ఆయనతో నటించాలనేది నా డ్రీమ్.తెలుగులో అవకాశాలు వచ్చాయి.. కానీ, నాకు కథలు నచ్చక రిజెక్ట్​ చేశా. మంచి కథ, రోల్​ వస్తే తెలుగులో నటించడానికి రెడీగా ఉన్నా. ఇప్పటికి ఒక 150పైనే టీవీ కమర్షియల్ యాడ్స్ చేసి ఉంటా.