
- రవిప్రకాశ్‌వి అసత్య ఆరోపణలు: చానల్ కొత్త, పాత యాజమాన్యాలు
- ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం
- లావాదేవీల వివరాలను వెల్లడిస్తూ ప్రకటన
టీవీ9 అమ్మకం వ్యవహారంలో ఎలాంటి హవాలా చెల్లింపులు లేవని చానెల్ కొత్త, పాత ప్రమోటర్లు స్పష్టంచేశారు. క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయిన చానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ బెయిల్‌ను పొందడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో, విచారణ అధికారుల ముందు తమపై చేసిన ఆరోపణలను ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు రవిప్రకాశ్‌పై న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టంచేశారు. ఈ మేరకు టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. వాస్తవాలను అందరి ముందుకు తేవడానికి టీవీ9 విక్రయ లావాదేవీలను వెల్లడిస్తున్నట్టు వివరించాయి.
ఆ లావాదేవీలన్నీ రికార్డుల్లో ఉన్నాయి..
‘‘ఆగస్టు 2018 నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్‌కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లను నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లను పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో స్పష్టంగా నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం ఇచ్చాం. ఈ వ్యవహారం అంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు’’ అని టీవీ 9 కొత్త, పాత యాజమాన్య సంస్థలు ప్రకటనలో తెలిపాయి.
‘‘ఈ బదిలీ వ్యవహారం అంతా ఆగస్టు 2018లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు. ఈ బదిలీ అంతా కూడా ఆయనకు తెలిసే జరిగింది. అయినా 9 నెలల తర్వాత, రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ విచారణను పక్కదారి పట్టించడానికి, తనను తాను కాపాడుకోవడానికి చేస్తున్నవనే అర్థమవుతోంది. సైఫ్ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్మెంట్ వ్యవహారంపై కూడా రవిప్రకాశ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాల్లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైఫ్ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత, సైఫ్ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతి కూడా ఇచ్చింది’’ అని వివరించారు. తమ పరువుకు భంగం కలిగించేలా అవాస్తమైన ఆరోపణలను చేసినందుకు రవిప్రకాశ్‌పై న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపారు.
బెయిల్ ఇవ్వొద్దు: పోలీసుల తరఫు లాయర్
రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారించింది. దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదని, అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున లాయర్ హరేన్ రావల్ కోర్టుకు చెప్పారు. ‘‘ఆర్థిక నేరాభియోగాలు ఉన్న వారికి బెయిల్ ఇవ్వొద్దు. ఇందులో హైకోర్టు తనకున్న విచక్షణాధికారాల్ని సద్వినియోగం చేసుకోవాలి. కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99 వేలకే రవిప్రకాశ్ అమ్మేశారు. శివాజీకి షేర్లు అమ్మడం కూడా బూటకం. అమ్మినట్లు చెబుతున్న షేర్ల ద్వారా వచ్చిన డబ్బును రికార్డుల్లో చూపలేదు’’ అని కోర్టుకు చెప్పారు. సాక్షుల్ని రవిప్రకాశ్ బెదిరిస్తున్నారని, బెయిలొస్తే కేసును ప్రభావితం చేస్తారన్నారు. రవిప్రకాష్ తరఫు లాయర్ వాదిస్తూ.. టీవీ 9 లోగోపై హక్కులు రవిప్రకాశ్‌కే ఉన్నాయని, దాన్ని అమ్ముకునే హక్కు ఆయనకు ఉందన్నారు. కేసు విచారణ 18కి వాయిదా పడింది. మరోవైపు తనపై హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను కొట్టేయాలంటూ శివాజీ హైకోర్టులో పిటిషన్ వేశారు.