తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్

తమిళనాడు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్
  •  
  • సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్
  • కుట్రకోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్
  • మరణాలకు టీవీకేనే కారణం: డీఎంకే 
  • విజయ్ పార్టీ నేతలపై కేసు నమోదు 
  • 40కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇంకా హాస్పిటల్​లో 67 మంది 
  • మృతుల ఫ్యామిలీలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించిన విజయ్ 
  • కరూర్​లో బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్

చెన్నై: తమిళనాడులోని కరూర్​లో శనివారం రాత్రి టీవీకే చీఫ్, నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతిచెందిన ఘటనపై రాజకీయ పార్టీలు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాయి. ఈ ఘటన వెనక కుట్ర కోణం ఉందని, సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ టీవీకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తొక్కిసలాటకు విజయ్ తోపాటు ఆ పార్టీ నేతలే కారణమంటూ అధికార డీఎంకే పార్టీ ఆరోపించింది. అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఇది సీఎం స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నా డీఎంకే విమర్శలు గుప్పించింది. 

మరోవైపు తొక్కిసలాట ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. శనివారం 38 మంది మరణించగా, ఆదివారం నాటికి మృతుల సంఖ్య 40కి చేరింది.  ఘటనలో 100 మందికిపైగా గాయపడగా.. ఇంకా 67 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతా వారు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం అర్ధరాత్రి దాటాక కరూర్ కు చేరుకుని ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కరూర్​లో తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ప్రమాద తీవ్రతను చాటిచెప్పేలా ఆదివారం గుట్టలకొద్దీ చెప్పులు, పార్టీ కండువాలు, చిరిగిపోయిన దుస్తులు, నలిగిపోయిన వాటర్ బాటిళ్లు కనిపించాయి.

తొక్కిసలాట వెనక కుట్ర జరిగింది: టీవీకే 

తొక్కిసలాట ఘటన వెనక కుట్ర కోణం ఉందని, దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ద్వారా లేదంటే సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని టీవీకే లీగల్ వింగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ అరివళగన్ వెల్లడించారు. ‘‘ఈ ఘటనలో నేరపూరిత కుట్ర జరిగింది. దీనిపై స్థానిక ప్రజల నుంచి మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. సీసీటీవీ ఫుటేజీ కూడా ఉంది. వీటిని బట్టి చూస్తే అధికార డీఎంకే పార్టీకి చెందిన స్థానిక నాయకులు కుట్ర చేసినట్టుగా అనిపిస్తోంది. అందుకే దీనిపై రాష్ట్ర సంస్థలతో కాకుండా స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టును కోరాం. సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని, లేదంటే కేసును సీబీఐకి ట్రాన్స్ ఫర్ చేయాలని విజ్ఞప్తి చేశాం” అని ఆయన తెలిపారు. ర్యాలీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించారన్న ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చారు. కరూర్​లో తొక్కిసలాట జరగడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. విజయ్ కావాలనే లేటుగా వచ్చారన్న డీఎంకే ఆరోపణలనూ ఆయన ఖండించారు. ర్యాలీలో జనంపై రాళ్లదాడి జరగడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, అదే సమయంలో కరెంట్ పోవడంతో తొక్కిసలాటకు దారితీసిందని ఆరోపించారు. 

సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించడం వల్లే..: డీఎంకే

కరూర్ ర్యాలీలో సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించడం వల్లే తొక్కిసలాట జరిగిందని, ఈ మరణాలకు టీవీకేనే కారణమని అధికార పార్టీ డీఎంకే నేతలు ఆరోపించారు. దీనిని రాజకీయం చేయాలని అనుకోవడం లేదని డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హపీజుల్లా అన్నారు. మరోవైపు, తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా టీవీకే జనరల్ సెక్రటరీ ఎన్. ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా నేత వీపీ మథియళగన్ లపై కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 105(ఉద్దేశం లేకుండా మరణానికి కారణమవడం), సెక్షన్ 106 (నిర్లక్ష్యంగా మరణానికి కారణమవడం) కింద కేసును ఫైల్ చేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. కాగా,సేఫ్టీ ప్రొటోకాల్స్​ను నిర్ణయించేంత వరకూ ర్యాలీలు నిర్వహించకుండా టీవీకే పార్టీపై నిషేధం విధించాలని కోరుతూ తొక్కిసలాటలో గాయపడిన ఓ బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. 

విజయ్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం..

తొక్కిసలాటలో 40 మంది చనిపోయిన నేపథ్యంలో చెన్నైలోని విజయ్​ ఇంటి వద్ద డీఎంకే అనుబంధ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసనలు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, తొక్కిసలాట ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

40కి పెరిగిన మృతులు..

టీవీకే చీఫ్ విజయ్ శనివారం కరూర్​లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగిందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ పి.సెంథిల్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఇంకా 67 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 38 మంది శనివారం రాత్రి చనిపోయారని, ఆదివారం మరో ఇద్దరు మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనలో 10 మంది మైనర్లు చనిపోయారని, వీరిలో రెండేండ్ల పిల్లలు ఇద్దరు, 8 ఏండ్ల పిల్లలు ఇద్దరు ఉన్నారని తెలిపారు. అలాగే మృతుల్లో 17 మంది మహిళలు, 13 మంది పురుషులు ఉన్నారన్నారు. గాయపడినవారిలో 26 మంది డిశ్చార్జ్ అయ్యారని, 67 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు.

రూ. 20 లక్షల పరిహారం ప్రకటించిన విజయ్  

కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు పార్టీ తరఫున  రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని టీవీకే చీఫ్ విజయ్ ఆదివారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు. ‘‘మీరు కోల్పోయిన దానికి ఇదేమంత పెద్ద మొత్తం కాదు. మీ ఆప్తులను తెచ్చివ్వలేం. కానీ ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడం నా బాధ్యత. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని విజయ్ పేర్కొన్నారు.