హిమాచల్ ప్రదేశ్లో రెండుసార్లు భూకంపం ..రెండుగా చీలిన రోడ్లు

హిమాచల్ ప్రదేశ్లో రెండుసార్లు భూకంపం ..రెండుగా చీలిన రోడ్లు

న్యూఢిల్లీ: ఓ పక్క హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు,వరదలు అతలాకుతలం చేస్తుండగా.. మరోవైపు భూకంపం సంభవించింది. బుధవారం(ఆగస్టు20) తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో రెండుసార్లు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. భూకంపంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.భూత్‌నాథ్ వంతెన దగ్గర రోడ్డు దెబ్బతింది. హనుమని బాగ్ దగ్గర వంతెన కొట్టుకుపోయింది. ఓ స్మశాన వాటిక ధ్వంసమయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 

చంబా జిల్లాలో 32.87 N అక్షాంశం ,76.09 E రేఖాంశం దగ్గర 20 కిలోమీటర్ల లోతులో 3.3 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున 4.39 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. మరోవైపు రెండవ భూకంపం రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది.32.71 N అక్షాంశం ,76.11 E రేఖాంశం దగ్గర 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం

ఇటీవల హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ,కొండచరియలు విరిగిపడ్డాయి. జూన్ 20న రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ 74 ఆకస్మిక వరదలు, 38 క్లౌడ్ బరస్ట్ లు ,72 పెద్ద కొండచరియలు విరిగిపడటంతో 276 మంది మృతిచెందారు. అనేక మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం..వర్ష సంబంధిత సంఘటనల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం రూ.2వేల211 కోట్ల నష్టం వాటిల్లింది.  

హిమాచల్‌లో అనేక రోడ్లు మూసివేత 

రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) ప్రకారం..మంగళవారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ రహదారి 305 (ఆట్-సైంజ్ రోడ్డు)తో సహా దాదాపు 357 రోడ్లు వాహనాల రాకపోకలకు మూసివేశారు.ఈ 357 రోడ్లలో 179 రోడ్లు మండి జిల్లాలో,కులులో 105 రోడ్లు మూసివేశారు.