
- ఉస్మాన్ సాగర్ 6 గేట్లు, హిమాయత్‌సాగర్ 4 గేట్లు ఓపెన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు మరోసారి నిండాయి. వికారాబాద్, తాండూర్, మోమిన్‌పేట, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా ఇన్ ఫ్లో వస్తున్నది. వరద ఉధృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు మూసీలోకి నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,789.40 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1,763.50 అడుగులు కాగా, 1762.80 అడుగుల నీళ్లు వచ్చాయి.
ఉస్మాన్ సాగర్ కు 1,800 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,072 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ కు 300 క్యూసెక్యూల ఇన్ ఫ్లో ఉండగా, 5,215 క్యూసెక్కులను రిలీజ్చేస్తున్నారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. వరద ప్రవాహంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్ – 17 సర్వీస్ రోడ్డును మూసివేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద సైతం మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఈ బ్రిడ్జిని సైతం తాత్కాలికంగా క్లోజ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు.