నటి ట్విషా శర్మ డెడ్ బాడీకి రీ పోస్ట్‎మార్టం.. అంగీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు

నటి ట్విషా శర్మ డెడ్ బాడీకి రీ పోస్ట్‎మార్టం.. అంగీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు

భోపాల్: నటి ట్విషా శర్మ మృతి కేసులో ట్విస్టుల మీద ట్వి్స్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విషా కేసు విచారణను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించగా.. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా డెడ్ బాడీకి రీ పోస్ట్‎మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఢిల్లీ ఎయిమ్స్ బృందం ట్విషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించనుందని కోర్టు తెలిపింది. అయితే, పోస్ట్‌మార్టం భోపాల్‌లోనే నిర్వహిస్తారని.. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ప్రత్యేక విమానంలో భోపాల్‎కు తీసుకువస్తారని కోర్టు పేర్కొంది. వీలైనంత త్వరగా ట్విషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించి సీల్డ్ కవర్ లో నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించింది.  

అనుమానస్పద స్థితిలో ట్విషా శర్మ మృతి..!

నటి ట్విషా శర్మ 2026, మే 12న భోపాల్‎లోని తన అత్తగారింట్లో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే అత్తగారింట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. ట్విషా మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ట్విషాను ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. ఇది వరకట్నం కోసం జరిగిన హత్య అని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే, ట్విషా మృతిపై భోపాల్ పోలీసుల దర్యాప్తు, పోస్ట్‌మార్టం నివేదికపైన అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్విషా మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్‎లో రీ పోస్ట్ మార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని మృతురాలి పేరేంట్స్ భోపాల్ లోకల్ కోర్టును ఆశ్రయించారు. ట్విషా పేరేంట్స్ అభ్యర్థనను భోపాల్ కోర్టు తిరస్కరించింది.

ట్విషా డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ట్విషా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యప్రదేశ్ హైకోర్టులో భోపాల్ లోకల్ కోర్టు తీర్పును సవాల్ చేశారు. శుక్రవారం (మే 22) ఈ పిటిషన్‏పై విచారణ చేపట్టిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్విషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అంగీకరించిన హైకోర్టు.. భోపాల్‎లోనే ఢిల్లీ ఎయిమ్స్ వైద్య బృందం సెకండ్ అటాప్సీ నిర్వహిస్తోందని పేర్కొంది.