నటి ట్విషా శర్మ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ చేతికి కేసు విచారణ

నటి ట్విషా శర్మ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ చేతికి కేసు విచారణ

భోపాల్: నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా మృతి కేసును మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం (మే 22) సీబీఐకి లేఖ రాసింది. ట్విషా శర్మ మృతి కేసును లోతుగా, సమగ్రంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరింది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు స్థాపన చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ అందిన తర్వాత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనుంది. 

నటి ట్విషా శర్మ 2026, మే 12న తన అత్తగారింట్లో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. న్యాయవాది సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే అత్తగారింట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. ట్విషా మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్విషాను ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విషా మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం (మే 20) ట్విషా పేరెంట్స్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‎ను కలిశారు. 

ALSO READ : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ తర్వాతే ప్రభాస్ ‘సలార్ 2’..

ఈ సందర్భంగా ట్విషా శర్మ మరణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు సీఎం హామీ ఇచ్చారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరపాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వం సీబీఐ లేఖ రాస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రీ పోస్ట్‎మార్టం కోసం ట్విషా మృతదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లాలనుకుంటే అందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.  సీఎం మోహన్ యాదవ్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లుగానే ట్విషా మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగించారు.