
- ఆఫర్‌ను అంగీకరించిన ట్విటర్ బోర్డు
- ఈ ఏడాది చివరిలోపు డీల్ పూర్తి
- బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటున్న మస్క్
వెలుగు బిజినెస్ డెస్క్: ట్విటర్ ఎలాన్ మస్క్ వశమైంది. బోర్డు మీటింగ్‌లో అందరూ మస్క్ ఆఫర్‌ను అంగీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్విటర్ వెల్లడించింది. దీంతో, అనుకున్నది నెరవేర్చుకున్నాడు ఎలాన్ మస్క్....ట్విటర్ కొంటానన్నాడు.....చేజిక్కించుకుని ప్రైవేటు కంపెనీగా మార్చాలనే తన ప్లాన్‌ను అమలు చేయడంలో మొదటి అడుగు సక్సెస్‌ఫుల్‌గా వేశాడు. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను మస్క్‌కు అప్పచెప్పడానికి అంగీకారం కుదిరింది. అంటే ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు. మస్క్ ఆఫర్ ప్రకటనకు ముందు రోజు అంటే ఏప్రిల్1 నాటి ట్విటర్ షేర్ రేటుతో పోలిస్తే ఆయనిస్తున్న ఆఫర్ 38 శాతం ఎక్కువ. మస్క్ ప్రకటనతో ట్విటర్ షేరు పరుగులు పెట్టింది. స్వేచ్ఛగా అభిప్రాయాల ప్రకటను తావిచ్చేలా ట్విటర్‌ను నడుపుతానని ఇప్పటికే ఎలాన్ మస్క్ వెల్లడించిన విషయం తెలిసిందే.
డీల్‌కు ఏకగ్రీవ ఆమోదం.....
ఎలాన్ మస్క్ డీల్‌కు ట్విటర్ బోర్డు సోమవారం ఆమోదం ప్రకటించింది. ఈ ఏడాది చివరలోపు డీల్ పూర్తవుతుంది. ట్విటర్ డీల్ కోసం బ్యాంకుల నుంచి 25.5 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకుంటున్నట్లు మస్క్ చెప్పారు. మిగిలిన డబ్బు ఆయన ఎలా తెచ్చుకునేదీ ఇంకా స్పష్టం కాలేదు.
మస్క్‌కు మస్తు ఫాలోవర్లు..
ట్విటర్ ప్లాట్‌ఫామ్‌ను ఎలాన్ మస్క్ఎక్కువగానే వాడతారు. ఆయనకు ఈ ప్లాట్‌ఫామ్‌పై 8.3 కోట్ల మంది పాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలోనే ట్విటర్లో 9 శాతం వాటాలను మస్క్ కొన్నారు. మార్చి నాటికి ట్విటర్‌పై తీవ్రమైన విమర్శలను గుప్పించడం పెంచారు. కంపెనీ అల్గారిథమ్స్ సరిగా లేవని, కొన్ని పోస్టులనే ప్రమోట్ చేస్తున్నాయని, జంక్పోస్టులతో నిండిపోతోందని....ఇలా కార్యకలాపాలపై విమర్శలు సంధించారు.
బోర్డులో సీటొద్దన్నారు..
ట్విటర్ బోర్డులో చేరాల్సిందిగా ఎలాన్ మస్క్‌ను ఏప్రిల్ 14 న ఆహ్వానించారు. కానీ, ఆయన దానిని తిరస్కరించారు. సంస్థను కొనడానికే ఇష్టపడతానని ప్రకటించారు. తాను ఇచ్చేదే ఫైనల్ ఆఫర్‌గా పేర్కొన్నారు. ఫ్రెండ్స్, తెలుసున్న వాళ్లతో స్టేటస్ అప్డేట్స్ పెంచుకోవడానికి వచ్చిన ట్విటర్ ప్లాట్‌ఫామ్ ఆ తర్వాత రోజుల్లో చిన్నపాటి పోస్టులను బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి మంచి వేదికగా మారిపోయింది. పొలిటీషియన్లు, సెలిబ్రిటీలు, జర్నలిస్టులు ఈ మైక్రోబ్లాగింగ్ను వాడటానికి ఇష్టపడటంతో బాగా పాపులర్ అయింది.