ట్విట్టర్ లో 25 శాతం మంది ఉద్యోగుల తొలగింపునకు మస్క్ యోచన

ట్విట్టర్ లో 25 శాతం మంది ఉద్యోగుల తొలగింపునకు మస్క్ యోచన

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ‪ను కొన్న తర్వాత ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.  మస్క్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు మొదటి రౌండ్‪లో భాగంగా 25 శాతం మంది ఉద్యోగులను తప్పించాలని యోచిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది, మస్క్ ప్రతినిధి అలెక్స్ స్పిరో ఉద్యోగాల కోతకు సంబంధించి ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం 2021 చివరి నాటికి ట్విట్టర్లో మొత్తం 7000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు మస్క్ తీసుకునే నిర్ణయాల ప్రకారం వారిలో నుంచి 25శాతం (దాదాపు 2వేల) మందిని తొలగించే చాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొంతకాలం క్రితం న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థలో వచ్చిన కథనాలను మస్క్ ఖండించారు. ఓ ట్విట్టర్ యూజర్ ఉద్యోగుల తొలగింపు గురించి అడిగిన ప్రశ్నకు మస్క్ బదులిస్తూ.. ‘ఇది తప్పు’ అని ట్వీట్ చేశారు.

కంపెనీలో ఉద్యోగాల కోత విధించాలని శనివారం ఎలాన్ మస్క్ ఆదేశించినట్టు ఆదివారం రోజున న్యూయార్క్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది. అలాగే కొన్ని టీమ్స్‌ను బాగా కుదించాలని, ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను నవంబరు 1లోపు పూర్తి చేయాలని ఆదేశించినట్టు నివేదించింది. నవంబరు ఒకటో తేదీన ఉద్యోగులు తమ కంపెన్సేషన్‌లో భాగంగా స్టాక్ గ్రాంట్స్ స్వీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐడెంటిటీ లేకుండా కొందరు వ్యక్తులను ప్రస్తావిస్తూ కోతలు మొదలవుతాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ తర్వాత భారీ చెల్లింపులను తప్పించుకునేందుకు మస్క్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారని వార్తలు వచ్చాయి. మస్క్ ఇప్పటికే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెను ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.