Elon Musk : ఆఫీసులో సామాను అమ్ముకుంటుండు

Elon Musk : ఆఫీసులో సామాను అమ్ముకుంటుండు

ట్విట్టర్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి వార్తల్లో నిలిచిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొంత మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపడంతో పాటు ఆపీసులు మూసివేయాలని నిర్ణయించాడు. అంతేకాదు.. ఆఫీసులో సామాన్లను వేలంలో అమ్మేస్తున్నాడు. తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ట్విట్టర్ లోగోతో పాటు కాఫీ మెషిన్లు, ఫర్నీచర్‌, కిచెన్‌ సామగ్రి వేలానికి ఉంచాడు. హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్‌ కంపెనీ నిర్వహించిన వేలంలో 4 అడుగుల ట్విట్టర్ లోగో రూ.81లక్షలకు అమ్ముడుపోయింది. 10 అడుగుల నియాన్ ట్విట్టర్ బర్డ్‌ రూ.32 లక్షలకు విక్రయించారు. మూడు కెగేటర్లు, ఫుడ్‌ డీహైడ్రేటర్‌, పిజ్జా ఓవెన్ ఒక్కోదానికి వేలంలో రూ. 8లక్షల చొప్పున ధర పలికింది. ‘@’ షేప్‌లో ఉన్న ఫ్లవర్ వేజ్‌కు రూ.12 లక్షలు, కాన్ఫరెన్స్ టేబుల్‌కి రూ.8 లక్షలు లభించాయి. ఫేస్ మాస్క్‌లు, ఫోన్‌ బూత్‌లతో పాటు మొత్తం 631 రకాల వస్తువులు వేలంలో అమ్ముడుపోయాయి.

మరికొన్ని లే ఆఫ్‌లు

ట్విట్టర్ లో మరిన్ని ఉద్యోగాల కోత ఉండదన్న ఎలాన్ మస్క్ ఆరు వారాలు తిరిగే సరికి మాట మార్చారు. కాస్ట్ కట్టింగ్ పేరుతో మరి కొందరు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు డిసైడయ్యారు. ప్రొడక్ట్ విభాగం ఉద్యోగులు ఈ లిస్టులో ఉన్నట్లు సమాచారం.