జమ్మూ కశ్మీర్ చైనాలో భాగమట.. ట్విట్టర్‌‌‌ లొకేషన్ ట్యాగ్‌‌పై దుమారం

జమ్మూ కశ్మీర్ చైనాలో భాగమట.. ట్విట్టర్‌‌‌ లొకేషన్ ట్యాగ్‌‌పై దుమారం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఇండో-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బార్డర్‌‌లో పరిస్థితులు ఉద్విగ్నంగా ఉన్న ఈ సమయంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లొకేషన్ ట్యాగ్ పై వివాదం చెలరేగుతోంది. భారత భూభాగంలోని జమ్మూ కశ్మీర్‌‌ చైనాలో ఉన్నట్లుగా ట్విట్టర్ లైవ్ లొకేషన్‌‌లో కనిపించడంపై దుమారం రేగుతోంది. నేషనల్ సెక్యూరిటీ అనలిస్ట్ నితిన్ గోఖలే ట్వీట్‌‌తో ఈ విషయం బయటపడింది.

గోఖలే పోస్ట్ చేసిన సదరు లొకేషన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన కొలీగ్‌‌తో కలసి లేహ్‌‌లో ఉన్న సమయంలో ట్విట్టర్‌‌లో ఖుషోక్ బకులా రింపోచీ ఎయిర్‌‌పోర్ట్‌‌లో ఉన్నట్లుగా లైవ్ వీడియో లొకేషన్ సెట్ చేయగా.. జమ్మూ కశ్మీర్, రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఉన్నట్లుగా లొకేషన్ ట్యాగ్ చూపిస్తోందంటూ స్క్రీన్ షాట్‌‌ను నితిన్ గోఖలే షేర్ చేశారు. ఎన్నిసార్లు యత్నించినా ఇలాగే వస్తోందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున రీట్వీట్లు, కామెంట్ల రూపంలో విమర్శలు రావడంతో ట్విట్టర్ సోమవారం స్పందించింది.

‘ఈ టెక్నికల్ సమస్య ఆదివారం మా దృష్టికి వచ్చింది. దీన్ని మేం అర్థం చేసుకున్నాం. పరిస్థితుల సున్నితత్వాన్ని గౌరవిస్తున్నాం. దీన్ని పరిష్కరించేందుకు మా టీమ్ వేగంగా పని చేసింది’ అని ట్విట్టర్ అధికార ప్రతినిధి చెప్పారు.