మనోహరాబాద్ ఐటీసీ గోదాం చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్..రూ.18 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

మనోహరాబాద్ ఐటీసీ గోదాం చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్..రూ.18 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

మెదక్, వెలుగు: మనోహరాబాద్ ఐటీసీ గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రూ.18 లక్షల దొంగసొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లికి చెందిన డ్రైవర్ మైదరబోయిన శ్రీకాంత్, కొనాయిపల్లికి చెందిన చెట్టి మహేశ్ కొన్నేళ్లుగా జీడిపల్లిలోని ఐటీసీ గోదాంలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐటీసీ గోదాంలో లోడవుతున్న సిగరెట్ బాక్సులను దొంగిలించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. వారాంతంలో  ఎల్లో వింగ్ ట్రాన్స్​ఫోర్ట్ కంపెనీ కి చెందిన సిగరెట్ లోడ్ తో ఉన్న వాహనాలు ఛార్జింగ్ కోసం పార్కింగ్ దగ్గర పెట్టడాన్ని గమనించారు. మొదటి సారి గతేడాది డిసెంబర్ 8న అర్ధరాత్రి ఐటీసీ గోదాంలోకి ప్రవేశించి ఛార్జింగ్ పాయింట్ లో సిగరెట్ లోడ్ తో ఉన్న టాటా ఎస్ వాహనం తాళాలను పగులగొట్టి రూ.8.30 లక్షల విలువైన సిగరెట్లు దొంగిలించారు. 

ఈ ఏడాది మే 18న రూ.15 లక్షల విలువైన సిగరెట్లు చోరీ చేశారు. సెప్టెంబర్ 21న మరోసారి చోరీకి పాల్పడి సుమారు రూ.10 లక్షల విలువైన సిగరెట్లు దొంగతనం చేశారు.  ఈ మూడు చోరీల్లో రూ.33 లక్షల విలువైన సిగరెట్ బాక్సులను దొంగిలించి వాటిని చెట్టి మహేశ్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి వీలు చూసుకోని రిటైల్ వ్యాపారస్తులకు అమ్మారు. రెండు సార్లు కలిపి సుమారు రూ.18.64 లక్షలు సంపాదించి వాటిని సమానంగా పంచుకున్నారు. 

మూడోసారి చోరీ చేసిన సిగరెట్లను శనివారం అమ్మడానికి  వాహనంలో తరలిస్తుండగా జీడిపల్లి వద్ద ఎస్సై సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న  పోలీసులు అనుమానంతో వాహనాన్ని ఆపారు. సిగరెట్ ప్యాకెట్ల లోడును గమనించి వాటి ఇన్వాయిస్ పత్రాలు చూపించమని అడిగారు. నిందితులు సరైన వివరాలు చెప్పకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించంగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. నిందితుల నుంచి టాటా గూడ్స్ వెహికల్,  అశోక్  లీల్యాండ్ వెహికల్, మహీంద్రా వెహికల్, రూ.10 లక్షల విలువైన సిగరెట్ ప్యాకెట్లు,  రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. 

దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్

మెదక్: దారి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్ జగద్గిరిగుట్ట అల్విన్ కాలనీలో ఉంటూ పెయింటింగ్ పని చేస్తున్న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన నీలగిరి దశరథ్, కూకట్ పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న రేగోడ్ మండలం లింగంపల్లికి చెందిన బుర్నోటి ఆగమయ్య, ఇంటర్​చదువుతున్న టేక్మాల్ మండలం కోరంపల్లికి చెందిన మైనర్​దన్నారం కృష్ణ ఈ నెల7న పాపన్నపేట మండలం నార్సింగికి వచ్చి అర్థరాత్రి కారులో హైదరాబాద్​ బయలుదేరారు.

మార్గ మధ్యలో నర్సాపూర్ సమీపంలో స్కూటీ మీద వెళ్తున్న మేకల కొండయ్యను ఆపి చంపుతామని బెదిరించి అతడి దగ్గర నుంచి రూ.350 నగదు, పర్సు లాక్కున్నారు. తర్వాత నర్సాపూర్ చౌరస్తాలో నిల్చున్న గొర్ల కాపరులు రేణివట్ల నరసింహ, బజారు రామప్పకు కారులో లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకొని కొంత దూరం వెళ్లాక వారిని చంపుతామని బెదిరించి రూ.2,500 నగదు గుంజుకోవడంతో పాటు, ఫోన్ పేకు రూ.5,500 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. దశరథ్, ఆగమయ్య, కృష్ణను శనివారం హైదరాబాద్ అల్విన్ కాలనీలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన స్విఫ్ట్ కారు, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.