తిమ్మాపూర్ లో మర్డర్ చేసి.. సిటీకి వచ్చి చైన్ స్నాచింగ్ లు

తిమ్మాపూర్ లో మర్డర్ చేసి.. సిటీకి వచ్చి చైన్ స్నాచింగ్ లు

నిందితులను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 

హైదరాబాద్‌,వెలుగు: డబ్బు, బంగారం కోసం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో జ్యోతిష్యుడిని హత్య చేసి పారిపోయి సిటీకి వచ్చి చైన్ స్నాచింగ్​లు చేస్తున్న ఇద్దరిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  కేసు వివరాలను సిటీ జాయింట్‌ సీపీ ఏఆర్‌‌ శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. వరంగల్‌ జిల్లా ఆలేరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన కోనేటి జ్ఞానేశ్వర్(26) కారు డ్రైవర్‌‌గా పనిచేసేవాడు. ఫిబ్రవరిలో గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి జైలులోరిమాండ్​కు తరలించారు. అదే జైలులో ఉన్న వరంగల్‌ జిల్లా ములుగు వెంకటాపూర్‌‌కి చెందిన నీలం శ్రీనివాస్ తో జ్ఞానేశ్వర్ కు  పరిచయమైంది. ఈ ఏడాది మే నెలలో వీరిద్దరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.  ఈజీ మనీ కోసం చోరీలు, చైన్ స్నాచింగ్స్​కు స్కెచ్  చేశారు. కరీంనగర్‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌ మండలం జోగయ్యపల్లి హనుమాన్ టెంపుల్‌లోని జ్యోతిష్యుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60)ని కలిసేందుకు ప్లాన్ చేశారు.

పెద్దన్న స్వామి జ్యోతిష్యం చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు సంపాదించాడని తెలుసుకుని.. ఎలాగైనా వాటిని కొట్టేయాలనుకున్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్లి మూడ్రోజులు అక్కడే ఉన్నారు. మే 3న అర్ధరాత్రి పెద్దన్న స్వామి రూమ్‌లోకి వెళ్లి అతడి గొంతుకు టవల్ బిగించి హత్య చేశారు. తర్వాత అల్మారాలోని  బంగారు ఇయర్ రింగ్స్,  రూ.32 వేలు దొంగిలించి పరారయ్యారు. జల్సాలకు ఈ డబ్బు సరిపోదని భావించి చైన్ స్నాచింగ్​లు చేసేందుకు డిసైడ్ అయ్యారు.  సూర్యాపేటలో  బైక్‌  కొట్టేసి దానిపై విజయవాడ వెళ్లారు. కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో 4 చైన్ స్నాచింగ్‌లు చేశారు. తిరిగి సిటీకి వచ్చారు. ఇటీవల ఎస్‌ఆర్‌‌నగర్‌‌ పీఎస్‌ పరిధిలో చైన్‌ స్నాచింగ్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మైత్రివనం వద్ద  జ్ఞానేశ్వర్, శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.