ఎంజీఎంలో విచిత్ర ఘటన : ఒకే మహిళకు రెండు బ్లడ్ గ్రూపులు..రెండు టెస్టుల్లో వేర్వేరు గ్రూపులుగా రిజల్ట్

ఎంజీఎంలో విచిత్ర ఘటన : ఒకే మహిళకు రెండు బ్లడ్ గ్రూపులు..రెండు టెస్టుల్లో వేర్వేరు గ్రూపులుగా రిజల్ట్
  • ఆందోళనలో పేషెంట్​ కుటుంబం

వరంగల్ సిటీ, వెలుగు: సాధారణంగా ప్రతి మనిషికి ఒకే బ్లడ్ గ్రూపు ఉంటుంది. అవసరమైనప్పుడు అదే గ్రూపునకు చెందిన రక్తాన్ని డాక్టర్లు ఎక్కిస్తారు. అయితే, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన ఐ.జ్యోతి(38) ఈ నెల 17న రక్తహీనతతో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చింది.

పరీక్షించిన డాక్టర్లు ఆమెను మెడికల్ ఫిమేల్ వార్డులో చేర్చారు. అదే రోజు బ్లడ్​ టెస్టు చేయగా గ్రూప్ బి పాజిటివ్‌‌‌‌గా తేలింది. దీంతో ఆమెకు బి పాజిటివ్ రక్తం ఎక్కించారు. ఈ నెల 19న మరోసారి రక్తం అవసరమవడంతో నమూనాలను మళ్లీ పరీక్షించగా అప్పుడు ‘ఒ’ పాజిటివ్‌‌‌‌గా తేలింది.

ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు బ్లడ్ గ్రూపులు రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటిసారి బి పాజిటివ్ రక్తం ఎక్కించిన తర్వాత జ్యోతికి తీవ్ర ఆయాసం, దద్దుర్లు వచ్చి అస్వస్థతకు గురైనట్లు బంధువులు తెలిపారు.

జ్యోతి ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి సిబ్బంది నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ తెలిపారు. జ్యోతి అసలు బ్లడ్ గ్రూప్ తెలుసుకునేందుకు పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా జ్యోతి వద్దకు మీడియాను అనుమతించడం లేదు.