బెంగళూరులో వందే భారత్ రైలు ఢీకొని ఇద్దరు నర్సింగ్ స్టూడెంట్స్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఆదివారం (నవంబర్ 23) మధ్యాహ్నం బెంగళూరు శివారు ప్రాంతంలో వందేభారత్ ట్రైన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరులోని సప్తగిరి ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న స్టెర్లిన్ ఎలిజా షాజి (19), జస్టిన్ జోసెఫ్ (20) అనే ఒకే తరగతికి చెందిన ఇద్దరు చనిపోవడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ కేరళ వాసులు కావడం గమనార్హం.
బెంగళూరు రైల్వే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో చిక్కబనవర రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థులు రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్నారా..?
ఫస్ట్ ఇయర్ నర్సింగ్ స్టూడెంట్స్ ఇద్దరూ యాక్సిడెంట్ కు గురవ్వటంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సూసైడ్ చేసుకున్నారని క్లాస్ మేట్స్ కొందరు ఆరోపించారు. అయితే కాలేజీ నుంచి పీజీ (హాస్టల్) కు వెళ్తున్న క్రమంలో ట్రాక్ క్రాస్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
అత్యంత వేగంగా ట్రైన్ ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద వశాత్తు జరిగిందా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరీక్షిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
