పహల్గాం దాడి: ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు అరెస్టు

పహల్గాం దాడి: ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు అరెస్టు

పహల్గాం ఉగ్రదాడితో యావత్ భారతదేశం ఉలిక్కి పడింది. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం లోయలో విహారయాత్రకు వెళ్లిన 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఉగ్రస్థావరాలతో పాటు ఆర్మీ బేస్ క్యాంపులను కూడా టార్గెట్ చేసి దాడులు చేసింది ఇండియా. ఈ పహల్గాం దాడికి సంబంధించి ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చిన ఇద్దరి అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. 

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రకటించింది. షెల్టర్ ఇవ్వ డంతో పాటు ఉగ్రవాదులకు కావాల్సిన ఆయుధాలు, ఆహార పదార్థాలు కూడా సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. 

పర్వేజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్ అనే ఇద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చినట్లు ఈ ఇద్దరు యువకులు అంగీకరించారు. అదేవిధంగా అటాక్ చేసిన ముగ్గురు టెర్రరిస్టుల పేర్లను కూడా అధికారులకు తెలిపారు. 

పహల్గాం లోయలోని బట్ కోట్ కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోతర్, పహల్గాం హిల్ పార్క్ కు చెందిన బషీర్ అహ్మద్ జోతర్ లు ఇద్దరు కలిసి ముగ్గురు టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వటమే కాకుండా కీలక స్థలాల గురించి రోడ్ మ్యాప్ వేసి ఇచ్చినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే ఇ తోయిబా (LeT) గ్రూప్ కు చెందిన టెర్రరిస్టులగా  పోలీసులకు వెల్లడించారు. ఈ ఇద్దరు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తులో మరింత పురోగతి వచ్చినట్లు తెలిపారు.