పుచ్చకాయ తిని అన్నదమ్ముల మృతి

పుచ్చకాయ తిని అన్నదమ్ముల మృతి

కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: ఎలుకలమందు కలిసిన నిల్వ ఉన్న పుచ్చకాయ తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందగా తల్లిదండ్రులతోపాటు, నానమ్మ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేట గ్రామంలో జరిగింది. విస్సంపేట గ్రామానికి చెందిన దారబోయిన శ్రీశైలం, గుణవతి దంపతులకు శివానంద్‌‌(12), శరణ్(10) ఇద్దరు కొడుకులు. శ్రీశైలం ట్రాక్టర్‌‌ నడుపుతూ, వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మూర్మూర్‌‌లోని ఓ స్కూల్​లో శివానంద్‌‌ నాలుగో తరగతి, శరణ్ మూడో తరగతి చదువుతున్నారు. గత నెల 30న శ్రీశైలం పుచ్చకాయ కొన్నారు. సగం తిని మిగతా సగం ఇంట్లో ఫ్రిజ్​ లేకపోవడంతో కూరగాయలు నిల్వ చేసేచోట పెట్టుకున్నారు. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండడంతో వాటిని చంపేందుకు అక్కడక్కడ ఎలుకల మందు చల్లారు. ఆ మందు తిన్న ఎలుకలు సగం కోసిన కాయను కూడా తిన్నాయి. ఈ విషయం గమనించని శ్రీశైలం, భార్య గుణవతి, కొడుకులు శివానంద్‌‌, శరణ్, నానమ్మ సారమ్మ మిగిలిన  కాయను మంగళవారం రాత్రి తిన్నారు. అదే రోజు ఇంట్లో ఎల్లమ్మ దేవత పూజ చేయడంతో వీరితోపాటు ఉన్న తాత కొమురయ్య, ఇతర బంధువులు కోడికూర, గుడాలు తిన్నరు. కానీ పుచ్చకాయ తిన్న ఐదుగురికి వాంతులు కావడంతో స్థానికంగా డాక్టర్‌‌కు చూపించి ఓఆర్‌‌ఎస్‌‌ ప్యాకెట్లు తాగారు. అయినా నీరసం తగ్గకపోవడం, తీవ్ర అస్వస్థతకు గురవడంతో బుధవారం కరీంనగర్‌‌లోని ప్రైవేటు ఆసుపత్రికి   తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం శివానంద్‌‌, చరణ్ మృతిచెందారు. శ్రీశైలం, గుణవతిని హైదరాబాద్‌‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  

వారసులు లేకుండా పోయారు

కొమురయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీశైలానికి శివానంద్‌‌, శరణ్ కొడుకులు కలిగారు. మిగిలిన ఇద్దరికి పిల్లలు లేకపోవడంతో అన్న కొడుకులనే తమ కొడుకులుగా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. శుక్రవారం చిన్నారులిద్దరూ మృతిచెందడంతో కుటుంబంలో వారసులు లేకుండా పోయారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.