ఇండోర్ స్టేడియం కూలి ఇద్దరు కూలీలు మృతి

ఇండోర్ స్టేడియం కూలి ఇద్దరు కూలీలు మృతి

చేవెళ్ల, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం స్లాబ్‌‌ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో సోమవారం జరిగింది. ఫైర్‌‌‌‌ ఫాక్స్‌‌ క్లబ్‌‌లో ఫస్ట్‌‌ మాస్టర్స్‌‌ టేబుల్‌‌ టెన్నీస్‌‌ అకాడమీకి చెందిన ఇండోర్‌‌‌‌ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. 40 ఫీట్ల ఎత్తు, 200 ఫీట్ల వెడల్పుతో జరుగుతున్న షెడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 

మిగిలిన పనులు చేసేందుకు పశ్చిమబెంగాల్‌‌, బీహార్‌‌‌‌, తదితర రాష్ట్రాలకు చెందిన 14 మంది వలస కూలీలు వచ్చారు. సోమవారం ఒక్కసారిగా స్లాబ్‌‌ పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది. కొందరు కూలీలు వెంటనే బయటకు పరుగులు తీశారు. మిగతా వారిని అప్రమత్తం చేసేలోపు స్టేడియం కూలిపోయింది. పశ్చిమబెంగాల్‌‌కు చెందిన బబుల్‌‌(35), బీహార్‌‌‌‌కు చెందిన సునీల్‌‌(26) శిథిలాల కింద  చిక్కుకొని చనిపోయారు. 

బయటకు పరుగులు తీసే క్రమంలో మరో ఏడుగురిపై శిథిలాలు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌‌ నుంచి ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ బృందాలను పిలిపించి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడ్డ వారిని హాస్పిటల్‌‌కు తరలించారు. మృతదేహాలను  పోస్టుమార్టం కోసం చేవెళ్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.