
- ఒక్కో కాలేజీకి రూ.10 కోట్ల నిధులు
- మెరుగైన వసతి సదుపాయాల కల్పన
- వచ్చే అకాడమిక్ నుంచి పనులు షురూ
మెదక్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం–2020 అమలులో భాగంగా రాష్ట్రంలో దశల వారీగా డైట్(జిల్లా విద్యా శిక్షణా సంస్థ) కాలేజీలను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని హంగులతో కొత్త కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ లను నిర్మించడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఛాత్రోపాధ్యాయులకు, ఇన్ సర్వీస్ టీచర్ లకు టెక్నికల్ శిక్షణ ఇచ్చేందుకు కంప్యూటర్ ల్యాబ్ లు, టెక్నికల్ ల్యాబ్ లను విద్యా శాఖ ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 10 డైట్ కాలేజీలు ఉండగా రెండేండ్ల డీఎడ్ కోర్సులో శిక్షణ అందిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అమలు చేసే వివిధ పథకాల అమలుపైనా ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. దశాబ్దాల కింద ఏర్పాటైన డైట్ కాలేజీల్లో సరైన వసతి, సదుపాయాలు లేవు.
పలు కాలేజీల్లో అవసరమైనన్ని క్లాస్ రూమ్ లు కూడా లేకపోగా, బిల్డింగ్ లు శిథిలావస్థకు చేరాయి. కొన్ని కాలేజీల్లో నిర్వహణ సరిగాలేక హాస్టల్ బిల్డింగ్ లు అధ్వానంగా మారాయి. ప్రైమరీ స్కూళ్లలో ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అమలు చేస్తుండగా, అందుకు అనుగుణంగా టీచర్లకు కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పేందుకు డైట్ కాలేజీల్లో సౌకర్యాలు లేవు. దీంతో కేంద్ర విద్యా శాఖ డైట్ కాలేజీలను మెరుగైన సదుపాయాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. గతేడాది రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబ్ నగర్ డైట్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చేందుకు ఎంపిక చేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి మెదక్, కరీంనగర్ డైట్ కాలేజీలు సెలెక్ట్ అయ్యాయి.
రూ.10 కోట్ల వరకు నిధులు
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఎంపిక చేసిన డైట్ కాలేజీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు అవుతాయి. ఆ నిధులతో కొత్త అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కాలేజ్, హాస్టల్ బిల్డింగ్ లు, ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, టెక్నికల్ ల్యాబ్, ఫర్నిచర్, లెక్చరర్లకు క్వార్టర్ లు, ప్లేగ్రౌండ్, 24 గంటలు నీటి సరఫరా ఉండే వాటర్ ట్యాంక్, గార్డెన్ ఏర్పాటు చేస్తారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతం ఉంటుంది.
6 నెలల కింద ప్రతిపాదనలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1989లో మెదక్ టౌన్లో ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ(డైట్) ఏర్పాటైంది. మొదట్లో కొన్నేండ్లు ఎల్లారెడ్డి క్రాస్ రోడ్డులో కొనసాగింది. ఆ తర్వాత ప్రస్తుత హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి సమీపంలో ప్రభుత్వం18 ఎకరాల స్థలం కేటాయించగా బిల్డింగ్ నిర్మించి డైట్ కాలేజీని అక్కడికి తరలించారు. ప్రస్తుతం మెదక్ డైట్ కాలేజీలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో డీఎడ్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో 50, సెకండ్ ఇయర్ లో 50 సీట్ల చొప్పున మూడు మీడియంలో కలిపి 300 సీట్లు ఉన్నాయి. అంతేగాక ప్రత్యేకంగా డిప్లమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు కూడా ఉంది.
ఇందులో కూడా ఫస్ట్ ఇయర్ లో 50 సీట్లు, సెకండ్ ఇయర్ లో 50 సీట్లు ఉన్నాయి. కాగా డైట్ కాలేజీ బిల్డింగ్ అవసరాలకు అనుగుణంగా లేదు. మౌలిక వసతుల కొరత ఉంది. హాస్టల్ బిల్డింగ్ నిర్వహణ సరిగాలేక నిరుపయోగంగా మారింది. ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు ఆధునికీకరణకు డైట్ అధికారులు ఆరు నెలల కింద రూ.17 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఎంపిక కావడంతో మెదక్ డైట్కు రూ.10 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే చాన్స్ ఉంది. దీంతో డైట్ రూపు రేఖలు పూర్తిగా మారుతాయి.