ఫోన్‌లో మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్

ఫోన్‌లో మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఎవరికైనాసరే ఒక డోసు ఇచ్చిన 15 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వాలి. కానీ, ఒక నర్సు మాత్రం ఫోన్‌లో మాట్లాడుతూ ఒకేసారి రెండు డోసులు ఇచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. అక్బర్‌పూర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల కమలేష్ కుమారి శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి వచ్చింది. అక్కడ వ్యాక్సినేషన్ చేస్తున్న నర్సు ఫోన్‌లో మాట్లాడుతూ.. కమలేష్ కుమారికి ఒక డోస్ ఇచ్చింది. ఫోన్‌ అలాగే మాట్లాడుతూ.. మొదటి డోస్ ఇచ్చిన విషయం మరచిపోయిన నర్సు.. రెండో డోసు కూడా వెంటనే ఇచ్చింది. అది గమనించిన కమలేష్ కుమారి వెంటనే నర్సును ప్రశ్నించింది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సిన నర్సు.. కమలేష్ కుమారిని తిట్టింది.

ఈ విషయాన్ని కమలేష్ కుమారి తన కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దాంతో వారంతా ఆరోగ్య కేంద్రానికి చేరుకొని నర్సును నిలదీశారు. అంతేకాకుండా నర్సు నిర్లక్ష్యం గురించి జిల్లా మేజిస్ట్రేట్ మరియు చీఫ్ మెడికల్ ఆఫీసర్ సహా సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నర్పు నిర్లక్ష్యంతో రెండు డోసులు ఇవ్వడం వల్ల కమలేష్ కుమారి చేతికి తేలికపాటి వాపు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
కమలేష్ కుమారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను జిల్లా మేజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ ఆదేశించారు.