
- చౌటుప్పల్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి
- డివైడర్‌ను ఢీకొట్టి, లారీ ఢీకొని పోలీస్ స్కార్పియో నుజ్జునుజ్జు
- ఏఎస్పీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. పోలీస్ ఆఫీసర్లది ఏపీ
- విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
- అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణం?
చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మేక చక్రధర్, శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం డోలా గ్రామానికి చెందిన జల్లు శాంతారావు ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో డీఎస్పీలుగా పని చేస్తున్నారు. ఇదే వింగ్‌లో రాజమండ్రికి చెందిన రామ్‌ప్రసాద్ ఏఎస్పీగా పని చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ నుంచి సింగపూర్ టూర్‌కు వెళ్తున్న నేపథ్యంలో సెక్యూరిటీగా వెళ్లడానికి వీళ్లు ముగ్గురూ శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయవాడ నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు.
అర్ధరాత్రి దాటినంక తెలంగాణలోని నల్గొండ జిల్లా కొర్ల పహాడ్ దగ్గరికి చేరుకున్నారు. అయితే, అక్కడ వీళ్లు ప్రయాణిస్తున్న కారు బ్రేక్‌డౌన్ అయింది. కారు ఎంత సేపటికి స్టార్ట్ కాకపోవడంతో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో కార్యాలయం నుంచి డ్రైవర్ నర్సింహారాజుకు స్కార్పియో వాహనం ఇచ్చి పంపించారు. ఆ కారులో శనివారం తెల్లవారుజామున ముగ్గురినీ ఎక్కించుకొని హైదరాబాద్ బయలుదేరాడు.
ఈ క్రమంలో ఖైతాపురం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో డ్రైవర్ స్కార్పియోను అదుపు చేయలేకపోయాడు. దీంతో పోలీస్ వెహికల్ డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డుకు అవతలి వైపు పడింది. అదే టైమ్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ.. స్కార్పియోను ఢీకొట్టడంతో ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు తలకు తీవ్ర గాయాలై స్పాట్‌లోనే చనిపోయారు. ఏఎస్పీ రామ్‌ప్రసాద్, డ్రైవర్ నర్సింహారాజుకు తీవ్ర గాయాలు కాగా.. చౌటుప్పల్ పోలీసులు వాళ్లను హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. డీఎస్పీల డెడ్ బాడీలకు చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ హఫీజ్ అహ్మద్, ఎస్పీ నాగబాబు పరిశీలించారు. కాగా, చనిపోయిన డీఎస్పీ చక్రధర్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శాంతారావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
స్పాట్‌కు రాచకొండ సీపీ..
ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు, డీసీపీ అక్షాన్స్ యాదవ్ పరిశీలించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చౌటుప్పల్ ఏసీపీతో చర్చించారు. అనంతరం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లను సీపీ సందర్శించారు.
అతివేగమే కారణమా ?
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం, వాహనాన్ని అతివేగంతో డ్రైవ్ చేయడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.