Earthquake: టిబెట్ను కుదిపేస్తున్న భూకంపాలు, భారీవర్షాలు..ఒకే రోజు రెండుసార్లు భూకంపం

Earthquake: టిబెట్ను కుదిపేస్తున్న భూకంపాలు, భారీవర్షాలు..ఒకే రోజు రెండుసార్లు భూకంపం

టిబెట్‌లో రెండుసార్లు భూకంపం సంభవించింది. బుధవారం (జూలై30) కేవలం 5 గంటల వ్యవధిలో 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపాలు టిబెట్ ను కుదిపేశాయి. మరోవైపు భారీ వర్షపాతం కారణంగా వరదలు కూడా సంభవించాయి. మొదటి భూకంపం 4.3 తీవ్రతతో ఉదయం 6:58 గంటలకు భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. రెండవ భూకంపం అదే రోజు 4.0 తీవ్రతతో ఉదయం 11:31 గంటలకు10 కిలోమీటర్ల లోతులోనే సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. 

ఈ భూకంపాలు తక్కువ లోతులో సంభవించడం వల్ల వాటి భూకంప తరంగాలు తక్కువ దూరం ప్రయాణించి ఉపరితలంపైకి చేరుతాయి. దీని వల్ల తీవ్రమైన ప్రకంపనలు ఏర్పడి అధిక నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని NCS హెచ్చరించింది. 

టిబెట్ ,నేపాల్ హిమాలయాలలోని ప్రధాన భూకంప పగుళ్ల రేఖ వెంట ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్‌కు నిరంతరం ఘర్షణ ఉంటుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణ కారణంగా ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. టిబెటన్ పీఠభూమిని భూకంపాలకు గురయ్యే ప్రాంతంగా మారుస్తుంది.

భారీ వర్షపాతం..వరదల పరిస్థితి

బుధవారం తెల్లవారుజామున టిబెట్‌లో కురిసిన భారీ వర్షపాతం కారణంగా నేపాల్‌లోకి ప్రవహించే నదులు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి.  ఈ వర్షపాతం త్రిశూలి నదిలో వరదలకు దారితీసింది. రసూవాలోని ఉత్తర గయా, కిస్పాంగ్‌లోని త్రిశూలి 3B హబ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరిగాయి. అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. రసూవాగాధి ప్రాంతంలో కూడా నీటి మట్టాలు పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ALSO READ : రష్యా భూకంపంతో 40 దేశాలకు సునామీ హెచ్చరికలు.. ఇండియాపై ప్రభావం ఉంటుందా..?

జూలై 8న టిబెట్ సరిహద్దులో ఉన్న రసూవా ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆ సమయంలో లెందే నది నేపాల్-చైనా సరిహద్దు సమీపంలోని మౌలిక సదుపాయాలను కొట్టుకుపోవడంతో ఏడుగురు మరణించారు. డజనుకు పైగా గల్లంతయ్యారు.

టిబెట్‌లో భూకంపాలు ,భారీ వర్షపాతం ఆ ప్రాంతంలో సహజ విపత్తుల ప్రమాదాన్ని పెంచుతుంది. టెక్టోనిక్ కార్యకలాపాలు, భారీ వర్షపాతం ,హిమనీనద కరిగిపోవడం వంటివి టెబెటన్లకు తీవ్రముప్పును కలిగించే అవకాశం ఉంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.