
గుండాల, వెలుగు: ఇద్దరు నకిలీ మావోయిస్టులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీ పాపయ్య, పాయం రాజేందర్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రజా ప్రతిఘటన అజ్ఞాత దళంలో పని చేశారు. వీరిద్దరూ తమ జల్సాల కోసం గుండాల, ఆలపల్లి మండలాలలో ప్రైవేటు వ్యాపారస్తులకు ఫోన్ చేసి మావోయిస్టుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం అందింది.
గుండాల సీఐ రవీందర్, ఎస్సై ప్రత్యేక దృష్టి పెట్టి సోమవారం పెట్రోలింగ్ చేస్తుండగా తూరుబాక గ్రామం వద్ద బైకుపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళుతుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఇకపై ఎవరైనా మావోయిస్టుల పేరు చెప్పి బెదిరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇద్దరు నకిలీ మావోయిస్టులను పట్టుకున్నందుకు సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బందిని అభినందించారు.