కంబాపూర్ లో తీవ్ర విషాదం : మోటార్ పైపులు విద్యుత్ వైర్లకు తగిలి ఇద్దరు మృతి

కంబాపూర్ లో తీవ్ర విషాదం : మోటార్ పైపులు విద్యుత్ వైర్లకు తగిలి ఇద్దరు మృతి

పిట్లం, వెలుగు:  వ్యవసాయ పొలం వద్ద బోరు రిపేర్ చేస్తుండగా కరెంట్​షాక్​తో ఇద్దరు రైతు కూలీలు చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పిట్లం మండలం కంబాపూర్​గ్రామానికి చెందిన ఆగమప్ప పొలంలో బోరు రిపేర్ అవడంతో కౌలుదారు శివరాం మంగళవారం అదే గ్రామానికి చెందిన రైతు కూలీలు ఎర్ర హనుమాండ్లు(60), సంగం రాములు(40) లను తీసుకెళ్లాడు. బోరులోంచి పైపులు తీసుకుండగా.. పైన11 కేవీ కరెంట్ వైర్లు తగలి షాక్​కొట్టడడంతో హనుమాండ్లు, రాములు స్పాట్ లో చనిపోయారు. హనుమాండ్లుకు భార్య గంగవ్వ ఉండగా.. సంగం రాములుకు భార్య అంబవ్వ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో రెండు కుటుంబాలు బోరున విలపించాయి. ఇద్దరి మృతికి పొలం యజమాని,  కౌలుదారుడు బాధ్యత వహించాలని బాధిత కుటుంబాలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. 

న్యాయం జరిగే వరకు డెడ్ బాడీలను తీసుకెళ్లేది లేదని ఆందోళనకు దిగారు. బోధన్ లో ఉండే పొలం యజమాని ఆగమప్పకు ఫోన్ చేయగా తనకు సంబంధం లేదని తెలిపాడు. కౌలుదారు శివరాం తనకు తెలియదని, ఆగమప్ప చెబితేనే బోరు రిపేర్ కోసం తీసుకెళ్లానని చెప్పడంతో ఏటూ తెల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందడంతో బాన్సువాడ రూరల్​సీఐ రాజేశ్, అర్బన్ సీఐ అశోక్​ వెళ్లి  బాధిత కుటుంబాలకు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు.  ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తరలించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సిద్దిపేట జిల్లాలో  మరొకరు..

దుబ్బాక : సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణహరి(60) మంగళవారం వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లాడు. అయితే.. సోమవారం రాత్రి వీచిన గాలి వానకు విద్యుత్​స్తంభం కింద పడిపోయి ఉంది. చూసుకోకుండా కృష్ణహరి పనులు చేస్తుండగా.. విద్యుత్​వైర్లు తగలడంతో షాక్ కొట్టి స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.