అప్పుల బాధతో  ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో  ఇద్దరు రైతుల ఆత్మహత్య

ఉప్పునుంతల/భైంసా, వెలుగు: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్​ కర్నూల్ ​జిల్లా ఉప్పునుంతల మండలం దేవదారికుంట గ్రామానికి చెందిన జయరాం నాయక్(38) తనకున్న రెండెకరాలతోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని రెండేళ్లుగా పత్తి సాగుచేస్తున్నాడు. గతేడాది పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు పేరుకుపోయాయి. ఈ ఏడాది కూడా పత్తి వేయగా చేను ఆశించిన స్థాయిలో లేదు. చేనేమో ఇలా ఉంది.. కట్టాల్సిన అప్పు రూ.5లక్షలు అయ్యిందని ఇటీవల జయరాం భార్య బుజ్జితో చెప్పి బాధపడ్డాడు. ముందురోజు పంటకు వేసేందుకు తెచ్చిన పురుగుల మందును ఆదివారం వేకువజామున తాగాడు. తర్వాత తాను మందు తాగినట్లు భార్యతో చెప్పాడు. వెంటనే ఆమె అచ్చంపేట గవర్నమెంట్​హాస్పిటల్ కు తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ జయరాం మృతిచెందాడు. మృతునికి భార్యతోపాటు తేజ, కార్తీక్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాగే నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రాంటెక్ గ్రామానికి చెందిన గణేశ్(28) తనకున్న 2 ఎకరాల్లో పత్తి, సోయా వేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదే టైంలో ఇల్లు కొనడంతో అప్పులు రూ.5లక్షలకు చేరాయి. వాటిని తీర్చే మార్గం లేక ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిపోయిన గణేశ్​తరోడా గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి నిజామాబాద్ హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.