అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

కౌడిపల్లి/ఖానాపూర్, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్  జిల్లాలో ఒకరు, నిర్మల్  జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్  జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన తలారి అంజయ్య (42) కు ఎకరం పొలం ఉంది. పంట పెట్టుబడి కోసం అంజయ్య కొంత అప్పు చేశాడు. కానీ, దిగుబడి రాక నష్టం వచ్చింది. దీనికి తోడు కొత్త ఇంటి నిర్మాణానికి, చెల్లెలు పెండ్లి కోసం మరో రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. 

అప్పులు తీర్చేందుకు కొంత కాలం హైదరాబాద్ కు వలస వెళ్లి క్యాబ్  డ్రైవర్ గా పనిచేశాడు. 6 నెలల క్రితం ఇంటికి తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. కానీ, అప్పులు ఎలా తీర్చాలా? అని కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం రాత్రి.. పాత ఇంట్లో పడుకుంటానని చెప్పి వెళ్లాడు. ఇంట్లో వైరుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అంజయ్య కుమారుడు నిఖిల్  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అలాగే నిర్మల్  జిల్లా ఖానాపూర్  మండలం చందునాయక్  తండాలో గిరిజన యువరైతు లావుడ్య మహేందర్ (34)  అప్పుల బాధతో  సూసైడ్  చేసుకున్నాడు. మహేందర్ తనకున్న రెండెకరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేస్తున్నాడు. ఇందు కోసం రూ.4 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాది అధిక వర్షాలతో ఒక ఎకరం పత్తి పంట పూర్తిగా నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అప్పు తీర్చే మార్గం కనపడక.. శనివారం గ్రామ శివారులోని తన పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.