
పంటలు సరిగా పండక అప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన తేలు రాములు (42), సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఈదుగల్ల మల్లేశం (43) ఆత్మహత్య చేసుకున్నారు.
నర్సాపూర్(జి)/తొగుట, వెలుగు : అప్పుల బాధలు భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తేలు రాములు (42) రెండెకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి సాగు చేశాడు. వర్షాభావంతో మూడేండ్లుగా పంటలు సరిగా పండలేదు. పంట పెట్టుబడి, కూతురి పెండ్లి కోసం వడ్డీకి రూ.4 లక్షలు అప్పు చేశాడు. కరెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురైన రాములు శుక్రవారం పొలం వద్ద ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఈదుగల్ల మల్లేశం (43) ఎకరం భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. సాగు అవసరాలకు రూ.4 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గంలేక కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం పురుగుల మందు తాగాడు. సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు.. అక్కడి నుంచి సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేశం శుక్రవారం చనిపోయాడు. మల్లేశం భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.