విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలు

బషీర్ బాగ్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలు ఇస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులతో కలిసి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. అభిషేక్ రెడ్డి (30) తుమ్మ చిన్నమ్మ (41)తో  కలిసి హిమాయత్ నగర్‌‌లోని కుబేర టవర్స్‌లో జేఎంజే రెడ్డి కన్సల్టెన్సీని 2020లో  ప్రారంభించారు.  అభిషేక్  రెడ్డి గతంలో జాబ్ వీసాపై సింగపూర్ వెళ్లాడు.  అక్కడ ఉన్న పరిచయాలతో కన్సల్టెన్సీ ప్రారంభించాడు.

విదేశాల్లో ఎక్కువ జీతాలు, ప్రయోజనాలు ఉంటాయని క్వాలిఫికేషన్ లేకున్నా జాబ్స్ అంటూ ప్రకటనలు ఇచ్చాడు.  దీంతో దాదాపు 25 మంది నుంచి రూ.83 లక్షల వరకు చెల్లించారు. వారికి నకిలీ జాబ్ వీసాలు ఇచ్చారు. మూడు నెలల్లో ప్రాసెస్ చేస్తామన్నారు. మూడు నెలలు దాటినా ప్రాసెస్ కాలేదని బాధితులు పోలీసులకు  ఫిర్యాదుతో  పోలీసులు విచారించగా అవి నకిలీ వీసాలు అని తేలింది.

అభిషేక్ రెడ్డి పరారీలో ఉండడంతో గతంలో నారాయణగూడ పీఎస్​లో చీటింగ్ కేసు నమోదైంది. తర్వాత వారు తమ ఆఫీసును అల్వాల్ కు మార్చారు. అక్కడ కూడా కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉండగా, నారాయణగూడ పోలీసులతో కలిసి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్​పోలీసులు పట్టుకున్నారు. తర్వాత  రిమాండ్కు తరలించారు.