
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని రెండు ఆస్పత్రులను వైద్యాధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. వీడీఓఎస్ కాలనీలో ఉన్న ఓల్డ్ డీఎం హెచ్ఓ ఆఫీస్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెడిసిన్ స్టోర్ ను డీఎంహెచ్వో బి.కళావతి బాయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మయూరి సెంటర్ లో ఉన్న బ్రీత్ హాస్పిటల్ ను తనిఖీ చేసి హాస్పిటల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. జూలై నెల 23న తల్లాడకు చెందిన శ్రీదేవి(34) తీవ్ర అస్వస్థత తో బ్రీత్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది.
హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతిచెందింది. ఇటీవల ఆమె మృతిపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎం హెచ్ఓ బ్రీత్ హాస్పిటల్ ను తనిఖీ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి హాస్పిటల్ ను సీజ్ చేశారు. అప్పటికే హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్లను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఖమ్మం సిటీలోని వైరా రోడ్డులో ఉన్న మార్వెల్ హాస్పిటల్ గతంలో 168 మంది పేషెంట్లకు చికిత్స అందించినట్లుగా నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ కు నమోదు చేసిన విషయంపై తనిఖీ చేసి వెంటనే సీజ్ చేశారు. మార్వెల్ హాస్పిటల్ డాక్టర్ పై పీఎస్ లో కేసు నమోదు చేయించినట్లు డీఎంహెచ్వో తెలిపారు. ఈ తనిఖీ లో ప్రోగ్రాం అధికారి చంద్ నాయక్ ఉన్నారు.