దుబాయ్: వచ్చే నెలలో ఇండియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ టీమ్ పాల్గొనడంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రంగంలోకి దిగింది. ముంబై, కోల్‌కతా నగరాల్లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను నిర్వహించవద్దని, వాటిని వేరే ప్రాంతాలకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఐసీసీకి చెందిన ఇద్దరు సభ్యుల బృందం శనివారం ఢాకాలో పర్యటించి అక్కడి బోర్డు, ప్రభుత్వ అధికారులతో కీలక చర్చలు జరపనుంది. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ విషయంలో బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ ఒప్పందాన్ని బీసీసీఐ రద్దు చేయడం, స్థానిక రాజకీయ పరిణామాల వల్ల తమ ఆటగాళ్లకు ముప్పు పొంచి ఉందని బీసీబీ వాదిస్తోంది. ఈ మ్యాచ్‌లను దక్షిణాది నగరాలకు లేదా శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. అయితే, చివరి నిమిషంలో వేదికల మార్పు సాధ్యం కాదని, టోర్నీ భద్రతపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఐసీసీ స్పష్టం చేస్తోంది.
ఇదే విషయాన్ని బంగ్లా బోర్డు అధికారులకు చెప్పి ఒప్పించే చాన్సుంది. మరోవైపు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో తొమ్మిది మంది స్థానిక ఆటగాళ్లపై విధించిన సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపేందుకు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ చీఫ్ ఆండ్రూ ఎఫ్‌గ్రేవ్ కూడా ఢాకా చేరుకోనున్నారు.
