
జమ్మూ: ఎల్వోసీ బోర్డర్ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. సాధారణ పౌరులు, సైన్యం టార్గెట్ గా మంగళవారం రాత్రి మోర్టార్ షెల్స్ తో దాడులు జరిపింది. జమ్మూకాశ్మీర్ లోని హీరానగర్ చాంద్వా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు మోర్టార్లతో పాక్ దాడులకు పాల్పడిందని అధికారులు వెల్లడించారు. బీఎస్ఎఫ్ సిబ్బంది సమర్థవంతంగా ప్రతీకారం తీర్చుకున్నారని తెలిపారు. బోర్డర్ దాటి మంజకోటె ప్రాంతంలోకి షెల్ దూసుకువచ్చి ఓ గ్రామంలో ఇంటికి తగిలిందని, పదేళ్ల బాలికతో సహా ఆమె కుటుంబ సభ్యుడికి గాయాలయ్యాయని తెలిపారు. పాకిస్తాన్ రేంజర్లు కతువా జిల్లాలోని ఐబీ సెక్టార్ లో కూడా షెల్స్ తో దాడి చేశారని, ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టిందని చెప్పారు. బుధవారం ఉదయం మెన్దార్ టౌన్లో ఒక నివాస ప్రాంతంలో లైవ్ మోర్టార్ షెల్ పడిందని, దాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్మీ టీమ్ చర్యలు చేపట్టిందన్నారు.