
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు జవాన్లు శనివారం వీరమరణం పొందారు. టెర్రరిస్టులతో పోరాడుతూ అమరులయ్యారు. కుల్గాం జిల్లాలోని దట్టమైన అడవుల్లో గత 9 రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’ లో భాగంగా ముష్కరుల కోసం భద్రతా బలగాలు గాలిస్తుండగా.. బలగాలు, టెర్రరిస్టులకు మధ్య భీకర పోరు సాగింది.
ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు సైనికులు చనిపోయారు. వారిని ప్రీత్ పాల్ సింగ్, హర్మిందర్ సింగ్ గా గుర్తించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ ఆపరేషన్లో ఇప్పటివరకూ గాయపడిన వారి సంఖ్య పదికి చేరింది. ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య జరుగుతున్న సుదీర్ఘ ఎన్కౌంటర్లలో ఇదొకటి.
ఈ నెల 2 నుంచి ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. అడవుల్లో దాక్కున్న టెర్రరిస్టుల కోసం బలగాలు అణువణువూ జల్లెడపడుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయం కూడా తీసుకుంటున్నాయి. వాటితో బాంబులు జారవిడుస్తున్నారు. అయితే, అడవుల్లో యుద్ధం చేయడంలో ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకుని ఉండవచ్చని, దీంతో వారి జాడ కనుగొనడం కష్టంగా ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ టెర్రరిస్టులను వదలబోమన్నారు. సైనిక బలగాలు, పారా బలగాలతో పాటు మొత్తం 10 బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని వెల్లడించారు.
అమరులకు ఆర్మీ నివాళి
ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన జవాన్లు ప్రీత్పాల్ సింగ్, హర్మిందర్ సింగ్కు ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. అఖల్ అడవుల్లో టెర్రరిస్టులు తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఆర్మీ, పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలు ఈ నెల 2న గాలింపు చేపట్టడం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా జవాన్లకు నివాళులర్పించారు.