
జగిత్యాల, వెలుగు: గల్ఫ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించాడని ఓ వలస కార్మికుడికి అక్కడి పోలీసులు రెండు లక్షల ఫైన్ వేసారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగుకు చెందిన అమర కొండ శ్రీనివాస్ 7 నెలలకింద సౌదీ అరేబియా వెళ్ళాడు. ఒక నెల పనిచేసిన తర్వాత ఎక్కడ పని దొరక్క రూంలోనే ఉంటున్నాడు. లాక్ డౌన్ వల్ల రెండునెలలుగా అక్కడిక్కడ అప్పులు చేసి రోజులు గడుపుతున్నాడు. వారం రోజులుగా తిండికి ఇబ్బందిపడిన శ్రీనివాస్‌కు శనివారం తెలిసిన వ్యక్తి దగ్గర అప్పు చేశాడు. లాక్డౌన్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలవరకు మాత్రమే బయటకు వెళ్లాలి. రంజాన్ కావడంవల్ల రాత్రివరకు దుకాణాలు తెరిచిఉంటాయని భావించిన శ్రీనివాస్ కొంత ఆలస్యంగా చపాతీలు తీసుకునేందుకు బజారుకు వెళ్లాడు. లాక్డౌన్ గడువు ముగిసి ఐదు నిమిషాలే అయినా శ్రీనివాస్‌ను పట్టుకున్న అక్కడి పోలీసులు పది వేల రియాళ్లు (మన కరెన్సీలో రూ. 2 లక్షలు) ఫైన్ వేశారు. పూట గడవడానికి కష్టంగా ఉన్నా తాను రెండు లక్ష రూపాయల ఫైన్ ఎలా కట్టాలని, ఇప్పటికే ఏడు లక్షల అప్పు ఉందని, మరో రెండు లక్షలు కట్టడం తనవల్ల కాదని వాపోతున్నాడు. ఎవరైనా తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.