
ఎల్బీనగర్, వెలుగు: పోక్సో కేసుల్లో ఇద్దరికి జీవిత ఖైదుతోపాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న పాశం మహేశ్ కారు డ్రైవర్. 2018లో స్థానిక ఓ బాలికకు మాయమాటలు చెప్పి, అత్యాచారం చేశాడు. విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ నగర్ కు చెందిన షేక్ సలీం సమీపంలో ఉండే ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరం రుజువు కావడంతో మహేశ్, సలీంకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.