ప్రభుత్వ స్కీముల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రభుత్వ స్కీముల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల లక్ష్యసాధనలో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో బ్యాంకర్లు , జిల్లా అధికారులతో  రైతులకు రుణాల పంపిణీ,  స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్యం–పురోగతిపై  కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ వివిధ పథకాలకు సంబంధించి 100 శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ  ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.4,314.88  కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1591.41 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 1186.38 కోట్లు, స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.258 కోట్లు, ఇతర రంగాలకు రూ.1,218.47 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు. 

జిల్లాలోని 2,800 మంది మున్సిపల్ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లను బీమాలో చేర్పించామని తెలిపారు. అనంతరం మేరా యువభారత్, కరీంనగర్ ఆధ్వర్యంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ రూపొందించిన వికసిత్ భారత్–2047  పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌‌‌‌ దేశాయ్, ఎన్‌‌‌‌వైకే కోఆర్డినేటర్ రాంబాబు, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్‌‌‌‌, ఏవో సుధాకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, ఆర్బీఐ అధికారి తాన్య, నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ ఏజీఎం వెంకటేశ్‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.