సీతారామకాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లి.. ఇద్దరు మృతి

సీతారామకాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లి.. ఇద్దరు మృతి

బూర్గంపహాడ్, వెలుగు : చేపలు పట్టుకుందామని కాల్వ వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌‌‌‌ మండలం జింకలగూడెంలో ఆదివారం జరిగింది. బూర్గంపహాడ్‌‌‌‌ ఎస్సై రాజేశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెంలోని గాంధీనగర్‌‌‌‌కు చెందిన షేక్‌‌‌‌ జమీరుద్దీన్‌‌‌‌ (37) బైక్‌‌‌‌ మెకానిక్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అతడి అక్క కొడుకు, ఏపీలోని తెనాలికి చెందిన షేక్‌‌‌‌ రియాజ్‌‌‌‌ (17) జమీరుద్దీన్‌‌‌‌ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. 

ఆదివారం తెల్లవారుజామున సరదాగా చేపలు పట్టేందుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని జింకలగూడెం సీతారామకాల్వ వద్దకు వచ్చారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజేశ్‌‌‌‌ తన సిబ్బందితో సీతారామ కాల్వ వద్దకు చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం టైంలో ఇద్దరి డెడ్‌‌‌‌బాడీలు దొరికాయి. దీంతో పోలీసులు కొత్తగూడెంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.