
- చంటిబిడ్డను అమ్మినందుకు తల్లిదండ్రులు జైలుకు..
- శిశువిహార్లో అనాథగా రెండు నెలల బాబు.. డీఎన్‌ఏ టెస్టుల కోసం శాంపిల్స్ సేకరణ
- ‘సరోగసీ’ నాటకమాడిన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు కస్టడీపై నేడు తీర్పు
హైదరాబాద్ సిటీ / పద్మారావునగర్, వెలుగు: సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ధన దాహానికి రెండు నెలల శిశువు అనాథగా మారిండు. తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన బిడ్డ.. శిశువిహార్‌లో ఆశ్రయం పొందాల్సి వస్తున్నది. జన్మించిన కొద్ది రోజులకే ఆ శిశువును తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్నమ్రత.. వేరే దంపతులకు ‘సరోగసీ’ సంతానం అంటూ నమ్మించి అప్పగించింది.
ఇటీవల సరోగసీ నాటకం రట్టవడంతో నమ్రత, ఆమె కొడుకుతోపాటు చంటిబిడ్డను అమ్మిన అసోంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంటిబిడ్డను రెండురోజుల కింద శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తున్నారు. బిడ్డను అమ్మిన దంపతుల నుంచి, అదేవిధంగా బిడ్డను తమ ‘సరోగసీ’ బిడ్డగా నమ్మి ఇన్నాళ్లూ ఆలనాపాలన చూసిన దంపతుల నుంచి శాంపిల్స్ తీసుకొని.. పరీక్షలకు పంపించారు. ఇప్పటికే సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ప్రకారం ఆ బాబు అసోంకు చెందిన దంపతుల కొడుకు అని తేల్చారు. చివరగా డీఎన్‌ఏ రిపోర్ట్వస్తేనే అధికారికంగా ధ్రువీకరిస్తామంటున్నారు.
తల్లిదండ్రులు తీసుకోకపోతే దత్తత
డీఎన్‌ఏ పరీక్షల్లో చంటి బిడ్డ అసోంకు చెందిన దంపతుల బిడ్డ అని తేలినా, వారు జైలులో ఉన్నందున వారు వచ్చే వరకు శిశువిహార్సిబ్బంది సంరక్షణలోనే ఉంటాడు. వారు బయటకు వచ్చిన తర్వాత సంరక్షణ తీసుకుంటామని హామీ ఇస్తే అప్పగిస్తారు. ఒకవేళ వారు పెంచుకోవడానికి అంగీకరించకపోతే శిశువిహార్‌లోనే ఉంచుకుని కారా( CARA) గైడ్లైన్స్ప్రకారం దత్తతకు ఇస్తారు. ప్రస్తుతం బాబు అమీర్ పేట్ లోని శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతుండగా.. ఆలనాపాలన చూసుకుంటున్నామని, ఆరోగ్యంగానే ఉన్నాడని ఓ అధికారి తెలిపారు.
నిందితుల కస్టడీపై నేడు తీర్పు
సృష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్ అక్రమాల కేసులో అరెస్టయిన నిందితుల పోలీస్‌కస్టడీ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. ప్రధాన నిందితులైన డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణ రిమాండ్‌పై జైల్లో ఉన్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాలు, అనుమతి లేకుండా ఐవీఎఫ్ సెంటర్ నిర్వహణ.. ఇలా అనేక కోణాల్లో విచారణ చేపట్టేందుకు వారం రోజుల కస్టడీ కోరుతూ నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు మూడురోజుల కింద సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం తీర్పు ఇవ్వనున్నారు. మరోవైపు తమపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొంటూ డాక్టర్ నమ్రత తమ లాయర్లతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.