హైదరాబాద్ లో మరో రెండు బస్సు ప్రమాదాలు

హైదరాబాద్ లో మరో రెండు బస్సు ప్రమాదాలు
  • పెద్ద అంబర్​పేటలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
  •  ఆదిబట్లలో స్కూల్​ బస్సు ఢీకొని యువకుడు మృతి 

అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్/ఇబ్రహీంపట్నం, వెలుగు: ఏపీ కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువకముందే హైదరాబాద్​ సిటీలో మరో రెండు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌‌‌‌‌‌‌‌పేటలో ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్​బస్సు బోల్తా పడి, పలువురు గాయపడ్డారు. ఆదిబట్ల పరిధిలో స్కూల్​బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఏపీ–39–యూపీ–1963 నెంబర్​ న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు​ ఉదయం 9 గంటలకు మియాపూర్​ నుంచి గుంటూరు బయలుదేరింది.

 మార్గమధ్యలో పెద్ద అంబర్‌‌‌‌‌‌‌‌పేట​ఓఆర్ఆర్ కిందకు దిగుతున్న క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉండగా, అందులో ఆరుగురికి తీవ్రంగా, కొందరికి స్వల్పంగా గాయలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌‌‌‌లో హయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ దవాఖానకు తరలించారు.  గుంటూరుకు చెందిన షేక్ జహీర్ (20), ఆకుల గాయత్రి (23) ,  కాస్తిక్ సుభాష్‌‌‌‌ (23), మౌనిక (26),  ప్రత్యూష (26) , వేరా ఆంజనేయ రెడ్డి (63),  శ్రీనివాస్ (35) ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు.   ప్రత్యామ్నాయ డ్రైవర్లకు కంచన్‌‌‌‌బాగ్​ డీఆర్డీవో హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు. ఈ సంఘటనపై రెండు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.  దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్​మెట్​ ఇన్​స్పెక్టర్​ వి. అశోక్​రెడ్డి వెల్లడించారు.

స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలోని ఓఆర్ఆర్​సర్వీస్​రోడ్డులో  తుక్కుగూడ నుంచి బొంగ్లూర్​ వైపు వెళ్తున్న  ఇండస్ వ్యాలీ స్కూల్ బస్సు..ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని వరంగల్​ జిల్లా ధర్మసాగర్​ మండలం నర్సింగ్‌‌‌‌రావ్​ పల్లి గ్రామానికి చెందిన  ఫొటోగ్రాఫర్​ బండారి వినోద్​(22)గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​ ప్రకాశ్‌‌‌‌​నగర్​లో నివాసముండే  వినోద్.. ఓ ఈవెంట్‌‌‌‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల సీఐ రవికుమార్​తెలిపారు.