ఇంకో రెండు రోజులు వానలు.. హైదరాబాద్​లో వడగండ్లు

ఇంకో రెండు రోజులు వానలు.. హైదరాబాద్​లో వడగండ్లు
  • అద్దగంటపాటు భారీ వర్షం.. కూలిన చెట్లు, ట్రాఫిక్ జాం
  • వికారాబాద్​లో మూడు నాలుగు కిలోల ఐస్ గడ్డలు పడ్డయ్  

హైదరాబాద్/వికారాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్​, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో శనివారం పొద్దటి నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం మారిపోయింది. నల్లటి మబ్బులతో నిండిపోయి చీకటి కమ్మేసింది. నగరమంతటా సాయంత్రం అరగంటపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. దాదాపు రాష్ట్రమంతటా ముసురు పట్టింది.

వికారాబాద్ జిల్లాలో వడగళ్లతో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని మర్పల్లి శివారులో గురువారం మంచు వర్షం కురవగా శుక్రవారం రాత్రి ఎర్రవల్లిలో ఏకంగా మూడు నాలుగు కిలోల సైజులో మంచు గడ్డలు పడ్డాయి. శనివారం సాయంత్రం పిల్లిగుండ్ల, గుండ్లమర్పల్లి, మోమిన్ పేట్ మండలం చిన్న అమ్రాది, మేకవనం పల్లి, తదితర చోట్ల మంచు రాళ్లు అరగంటలో గుట్టలు గుట్టలుగా పడ్డాయి. చిన్న అమ్రాదిలో వీధులన్నీ ఐసు గడ్డలతో నిండిపోయాయి. సిమెంటు రేకుల ఇండ్లకు రంధ్రాలు పడగా.. ఇనుప రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. పిల్లిగుండ్లలోనూ ఐదు కిలోల సైజులో ఐసు గడ్డలు పడ్డాయి. రాళ్ల వానకు పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తమ జీవితంలో ఇంత పెద్ద వాన ఎప్పుడూ చూడలేదని వృద్ధులు చెప్పారు. 

దంచికొట్టిన వాన.. 

హైదరాబాద్ లో కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. తార్నాక, ఓయూ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్​పేట్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్, రాజేంద్రనగర్, ఆర్సీ పురం, మెహిదీపట్నం, నాచారం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడం, వీకెండ్ అవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అకాల వర్షాలతో నగరవాసులకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేందుకు డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉండాలని బల్దియా అధికారులను ఆదేశించారు.    

సూర్యాపేటలో 7.6 సెం.మీ. వర్షం 

సూర్యాపేట జిల్లా పాలకీడులో అత్యధికంగా 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 5.7, మేడ్చల్ జిల్లా కీసరలో 5.3, గద్వాల జిల్లా కాలూర్ తిమ్మనదొడ్డిలో 5.2, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో  4.9, మెదక్ జిల్లా చేగుంటలో 4.8, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 4.7, యాదగిరిగుట్టలో 4.6, కరీంనగర్​చిగురుమామిడిలో 4.5, కుత్బుల్లాపూర్ లో4.4, జీడిమెట్లలో 4.2, ఘట్కేసర్​లోని సింగపూర్ టౌన్​షిప్​లో 4.2, భాగ్యనగర్ నందనవనంలో 4.1, హుస్నాబాద్​లో 4.1, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 4, సుల్తాన్​పూర్​లో 3.9, మెదక్​ జిల్లా కౌడిపల్లిలో 3.8, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 3.8, భువనగిరిలో 3.7, హైదరాబాద్​ కాప్రాలో 3.7, కూకట్​పల్లిలో 3.6, కిష్టారెడ్డిపేట, కొడకండ్లలో 3.6, వనపర్తి జిల్లా మదనాపూర్​లో 3.3, ఖమ్మం జిల్లా వేంసూరులో 3.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  

ఇంకో రెండ్రోజులు..

రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆరెంజ్ అలర్ట్​ను కొనసాగించింది. ఆదివారం అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు చోట్ల వడగండ్లు పడే చాన్స్ ఉందని తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. మరోవైపు శనివారం పలు చోట్ల టెంపరేచర్లు పెరిగాయి. భారీ వర్షాలతో గురువారం పడిపోయిన టెంపరేచర్లు శుక్రవారం మళ్లీ పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్​లో అత్యధికంగా 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్​లో 31.8, భద్రాచలంలో 31.5, రామగుండం, మహబూబ్​నగర్​లలో 31.2, హనుమకొండలో 31 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి.