రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు

రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్​కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయని చెప్పింది. అలాగే, బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ కన్ఫర్మ్​ చేసింది.

ఈ నెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. 7వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని గురువారం విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొంది. 8న వాయుగుండంగా మారి.. తుఫానుగా రూపాంతరం చెందుతుందని తెలిపింది. అయితే, తుఫాను తీవ్రత, అది ప్రయాణించే మార్గం, తీరంలో ల్యాండ్​ అయ్యే పరిస్థితులు అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తెలుస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 8వ తేదీ నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.