రాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు

రాష్ట్రంలో మరో రెండ్రోజులు వానలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. నల్గొండ జిల్లా గుర్రంపోడులో అత్యధికంగా 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా మునుగోడులో 5.2, చండూరులో 4.8, కనగల్​లో 4.2, ఖమ్మం జిల్లా గంగారంలో 4, యాదాద్రి భువనగిరి జిల్లా బిజిలపూర్​లో 3.7, కట్టంగూర్​లో 3.5, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 3.3, సూర్యాపేట జిల్లా శాంతినగర్​లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, వర్షాల ప్రభావంతో ఎండలు తగ్గాయి. చాలాచోట్ల టెంపరేచర్లు తక్కువే నమోదయ్యాయి. నిర్మల్​ జిల్లా తానూరులో అత్యధికంగా 41.8 డిగ్రీల టెంపరేచర్​నమోదైంది. అదే జిల్లా భైంసా, ఆదిలాబాద్​జిల్లా పిప్పల్​ధారిలో 41.2, అర్లి టీలో 40.9, కామారెడ్డి జిల్లా బొమ్మన్​దేవిపల్లిలో 40.1, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 40, పొచ్చెరలో 39.9, నిజామాబాద్​జిల్లా కల్దుర్కిలో 39.9, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్థానపేట, నిజామాబాద్​జిల్లా ఏడపల్లిలో 39.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో టెంపరేచర్లు 30 డిగ్రీలలోపు రికార్డయ్యాయి.