మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు వీళ్లే

మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు వీళ్లే

లోక్సభలో బంపర్  మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది.  545 మంది ఎంపీలకు 456 మంది హాజరై  ఓటు వేశారు.  ఇందులో 454 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా ఇద్దరు మజ్లిస్ ఎంపీలు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇదే పార్టీకి చెందిన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు.  

ఓబీసీ,  ముస్లిం మహిళలకు  కోటా లేకపోవడంతో  వీరు  ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా తెలుస్తో్ంది.  బిల్లు ఆమోదానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండడంతో మాన్యువల్ విధానంలో ఓటింగ్ జరిపారు. ఎరుపు, ఆకు పచ్చ రంగు స్లిప్పులతో ఓటింగ్ జరిపారు. బిల్లుకు మద్దతు తెలిపేవారు ఆకుపచ్చ చీటీపై ‘ఎస్‌’ రాయాలని, వ్యతిరేకించే వారు ఎర్ర చీటీపై ‘నో’ అని రాయాలని సభ సెక్రటరీ జనరల్ సూచించాక ఓటింగ్ జరిగింది.  

అమిత్ షా కీలక ప్రకటన 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక  ఎన్నికల్లో  ఈ బిల్లు వర్తించదని స్పష్టం చేశారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ పూర్తయిన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు పూర్తయిన తరువాత ఈ ప్రక్రియను మొదలు పెడతామని అమిత్ షా స్పష్టం చేశారు. మహిళా సాధికారత విషయంలో బీజేపీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా నిలుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమకు రాజకీయ అజెండా కాదనన్నారు.