ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కి అప్పగించింది కేంద్ర హోంశాఖ. ఈ కేసులో విచారణ ప్రారంభించింది NIA బృందం. ఈ క్రమంలో ఫరీదాబాద్‌లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. సెక్టార్ 56లోని అద్దె ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు. లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఢిల్లీ పేలుడు కేసులో హ్యుందయ్ i20 కారుకు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీ బ్లాస్ట్ కంటే ముందు పొల్యూషన్ చెక్ చేయించిన విజువల్స్ బయటకు వచ్చాయి. పోలీసులు కారు ఆపినా డౌట్ రాకుండా ఉండేందుకు పొల్చుషన్ చెక్ చేయించినట్లు తెలుస్తోంది. పొల్యూషన్ చెకింగ్ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ఫూటేజ్ ఆధారంగా తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీ పేలుళ్లపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ బృందాలు దర్యాప్తు చేపట్టారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పుల్వామాలో ముగ్గురు అనుమానితుల అరెస్ట్ చేశారు.
భారీ పేలుడుతో సోమవారం (నవంబర్ 11) దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్‌లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. అరుపులు.. ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఓ వ్యక్తి డెడ్‌బాడీ కారు సైడ్ మిర్రర్‌పై వేలాడుతూ కనిపించింది. ఆటో రిక్షాపై ఓ వ్యక్తి చేయి తెగిపడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమవారం (నవంబర్ 11) సాయంత్రం 6.52 గంటలకు హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్లాస్ట్ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని, వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నదని చెప్తున్నారు. పేలుడు ధాటికి 22 కార్లు, 2 ఈ -రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి.
కొన్ని మీటర్ల దూరం వరకు పార్క్ చేసిన వాహనాల అద్దాలూ ధ్వంసం అయ్యాయి. ఇండ్లు, దుకాణాల తలుపులు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం అనంతరం 20 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. పేలుడు ఘటనలో 24 మందిగాయపడ్డారు.
వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నాయి ఏజెన్సీలు.
