మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ)కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఎన్టీపీసీలో తీసుకున్న పర్యావరణహిత చర్యలకు గాను గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ప్రముఖ పర్యావరణ సంస్థ ఎన్విరో ఎక్స్‌లెన్స్ కౌన్సిల్ సలహాదారు వి.ఎన్.చౌదరి.. ముంబైలో జరిగిన సంస్థ సమావేశంలో వెల్లడించారు.
సమర్థ నీటి వినియోగానికి గాను నేషనల్ లెవల్ బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్అవార్డు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ అవార్డు ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని 500మెగావాట్లు అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న 75కు పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు అధారంగా అవార్డులకు ఎంపికచేశారు. అవార్డులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు. దీనిపై సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆనందం వ్యక్తంచేశారు. ప్లాంట్ అధికారులను, ఉద్యోగులను అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్టీపీపీ ఉన్నతోద్యోగులు పాల్గొన్నారు.
