మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి .. మరొకరిని కాపాడిన స్థానికులు

మంజీరా నదిలో మునిగి ఇద్దరు మృతి .. మరొకరిని కాపాడిన స్థానికులు

మెదక్‌‌ టౌన్‌‌, వెలుగు : మంజీరా నదిలో మునిగి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా పేరూరు గ్రామంలో మంగళవారం జరిగింది. మెదక్‌‌ రూరల్‌‌ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ మంగళవారం చనిపోవడంతో గ్రామ శివారులోని మంజీరా నది సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

అనంతరం ఆమె బంధువైన చింతకింది శ్రీకృష్ణ (15) స్నానం చేసేందుకు మంజీరా నదిలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో గమనించిన చింతకింది బీరయ్య (38), శివయ్య అనే వ్యక్తులు శ్రీకృష్ణను కాపాడేందుకు ప్రయత్నించగా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. 

అక్కడ ఉన్న వారు శివయ్యను కాపాడగా శ్రీకృష్ణ, బీరయ్య ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న మెదక్‌‌ రూరల్‌‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్‌‌ స్టేషన్‌‌ సిబ్బంది, గజ ఈతగాళ్ల ద్వారా నదిలో గాలించగా.. ఇద్దరి డెడ్‌‌బాడీలు దొరికాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.